EPFO: కరోనా ఎఫెక్ట్... మూతబడిన 71 లక్షల పీఎఫ్​ ఖాతాలు

71 lakh PF Accounts closed in 2020

  • 2020లో మూసివేతలో 6.5% పెరుగుదల
  • నగదు ఉపసంహరణలూ ఎక్కువే
  • రూ.73,498 కోట్లు విత్ డ్రా
  • అంతకుముందు ఏడాది కన్నా 33% ఎక్కువ

కరోనా మహమ్మారితో భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాలు భారీగా మూతపడ్డాయి. 2019 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం ఎక్కువ ఖాతాలు క్లోజ్ అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి లోక్ సభలో స్వయంగా వెల్లడించారు. రిటైర్మెంట్, ఉద్యోగం కోల్పోవడం, ఉద్యోగం మారడం వంటి కారణాలతో 2019–2020లో 66.7 లక్షల ఖాతాలు క్లోజ్ అయితే.. 2020–2021 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లోనే అది 71 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 కోట్ల పీఎఫ్ ఖాతాలున్నాయి.

పీఎఫ్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ కూడా గత ఏడాది భారీగా పెరిగింది. దాదాపు 2019తో పోలిస్తే 2020లో 33 శాతం ఎక్కువ లావాదేవీలు జరిగాయి. మొత్తంగా పోయినేడాది 73,498 కోట్ల రూపాయలను పీఎఫ్ ఖాతాదారులు డబ్బు ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఏడాది అది కేవలం రూ.55,215 కోట్లే కావడం గమనార్హం.

కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం, నిరుద్యోగిత రేటు పెరగడం వంటి కారణాలతో ఈపీఎఫ్ నుంచి పాక్షిక ఉపసంహరణలూ పెరిగాయి. 2019తో పోలిస్తే 2020లో రెట్టింపయ్యాయి. గత ఏడాది 1.3 కోట్ల పాక్షిక ఉపసంహరణలు జరిగితే.. అంతకుముందు ఏడాది అది కేవలం 54.4 లక్షలుగా ఉంది. కరోనా సంక్షోభ సమయంలో ఖాతాదారులు డబ్బు డ్రా చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ సైట్ లో ఓ ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 75 శాతం నగదును డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది.

2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు నెలవారీగా మూతపడిన ఖాతాలు

  • ఏప్రిల్       2,30,593
  • మే           4,62,635
  • జూన్        6,22,856
  • జూలై        8,45,755
  • ఆగస్ట్       7,77,410
  • సెప్టెంబర్  11,18,517
  • అక్టోబర్    11,18,751
  • నవంబర్    9,54,158
  • డిసెంబర్    9,71,254
  • మొత్తం     71,01,929

2020లో పాక్షిక ఉపసంహరణలు

  • ఏప్రిల్     13,43,278
  • మే           10,52,098
  • జూన్        12,96,415
  • జూలై        15,57,853
  • ఆగస్ట్        11,81,265
  • సెప్టెంబర్    16,66,191
  • అక్టోబర్    16,58,037
  • నవంబర్    14,42,020
  • డిసెంబర్    15,74,963
  • మొత్తం     1,27,72,120

  • Loading...

More Telugu News