KCR: నోముల నర్సింహయ్య మృతి పట్ల అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్

CM KCR introduces condolence resolution on Nomula Narsimhaiah death

  • గత డిసెంబరులో నోముల మృతి
  • గుండెపోటుతో హఠాన్మరణం
  • ప్రజల కోసం జీవితాన్ని అంకింతం చేశారన్న కేసీఆర్
  • నేటితరం నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు
  • వ్యక్తిగతంగా తనకెంతో సన్నిహితుడని వెల్లడి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ రాజకీయవేత్త నోముల నర్సింహయ్య మృతి పట్ల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, నోములను ఉద్యమశీలి అని, నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం తపించిన వ్యక్తి అని కీర్తించారు. పోరాటాల పురిటిగడ్డ నల్గొండ చైతన్యాన్ని పుణికిపుచ్చుకుని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే జీవితాన్ని అంకింతం చేశారని కొనియాడారు.

విపక్ష నేతగా శాసనసభలో ఎలా వ్యవహరించాలో, హుందాగా ఎలా మెలగాలో, ప్రజల సమస్యలను ఎలా ప్రస్తావించాలో నేటితరం నాయకులు నోముల జీవితాన్ని చూసి నేర్చుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నకిరేకల్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు నెగ్గిన నోముల తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడారని, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల సాగునీటి హక్కుల కోసం, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ రైతుల ప్రయోజనాల కోసం నిరంతరం ఎలుగెత్తారని వెల్లడించారు.

సీపీఎం పార్టీకి విశేష సేవలందించిన నోముల నర్సింహయ్య... ప్రత్యేక తెలంగాణ కోసం పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారని, టీఆర్ఎస్ ద్వారానే తెలంగాణ ప్రయోజనాలు నెరవేరతాయని బలంగా నమ్మారని వివరించారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారని, సాగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే చివరి వరకు శ్రమించారని సీఎం కేసీఆర్ కితాబిచ్చారు.

64 ఏళ్ల వయసులో గుండెపోటుతో నోముల హఠాన్మరణం పాలవడం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగానూ నోముల తనకెంతో సన్నిహితుడని, ఆయన ఆత్మీయతను, విలువల పట్ల ఆయన నిబద్ధతను మరువలేనని పేర్కొన్నారు. నిజమైన ప్రజానాయకుడిగా నోముల నర్సింహయ్య చిరకాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News