COVID19: నిన్న ఒక్కరోజే 30 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్
- ఇప్పటిదాకా ఒక్కరోజులో ఇదే అత్యధికం
- మొత్తంగా 3.29 కోట్ల మందికి టీకా
- 2.7 కోట్ల మందికి మొదటి డోసు
- 58.67 లక్షల మందికి రెండో డోసు
సోమవారం ఒక్కరోజే 30 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటిదాకా ఒక్కరోజులో వేసిన వ్యాక్సిన్లలో ఇదే అత్యధికమని పేర్కొంది. దీంతో కరోనా టీకా తీసుకున్న వారి సంఖ్య 3 కోట్ల 29 లక్షల 47 వేల 432కు చేరిందని వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుల సంఖ్య 15 రోజుల్లోనే కోటి మార్కు దాటిందని పేర్కొంది.
సోమవారం 30,39,394 మందికి వ్యాక్సిన్ వేయగా.. 26,27,099 మందికి మొదటి డోసు ఇచ్చినట్టు వెల్లడించింది. 4,12,295 మంది రెండో డోసు తీసుకున్నారని చెప్పింది. ఇప్పటిదాకా మొత్తంగా 2 కోట్ల 70 లక్షల 79 వేల 484 మంది మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకోగా.. 58 లక్షల 67 వేల 948 మంది రెండో డోసు టీకాలు తీసుకున్నట్టు ప్రకటించింది.