Supreme Court: ప్రాజెక్టు నిర్వాసితుల అంశంలో తెలంగాణ సర్కారుకు సుప్రీంలో ఊరట

Supreme Court orders in project expats issue favor to Telangana govt

  • పెళ్లికాని యువతకూ పరిహారం చెల్లించాలన్న హైకోర్టు
  • హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన సర్కారు
  • గతంలో స్టే ఇచ్చిన సుప్రీం.. ప్రతివాదులకు నోటీసులు 
  • తాజా విచారణలో స్పష్టమైన ఆదేశాలు జారీ
  • పూర్తిస్థాయిలో వాదనలు వినాలని హైకోర్టుకు స్పష్టీకరణ

తెలంగాణ సర్కారు కాళేశ్వరం, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి ప్రాజెక్టులను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించడం తెలిసిందే. అయితే నిర్వాసితుల అంశంలో ప్రభుత్వానికి చిక్కులు ఎదురయ్యాయి. పెళ్లి కాని మేజర్ యువతీయువకులకు కూడా విడిగా పరిహారం చెల్లించాలని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని హైకోర్టు గతంలో స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ నేడు విచారణకు వచ్చింది.

తెలంగాణ సర్కారు తరఫున సీనియర్ అడ్వొకేట్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. గతంలో పూర్తి వాదనలు వినకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. వైద్యనాథన్ వాదనలతో జస్టిస్ ఖన్ విల్కర్ ధర్మాసనం ఏకీభవించింది. నిర్వాసితుల అంశంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనబెడుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పరిహారం అంశంలో దాఖలైన పిటిషన్లపై పూర్తిస్థాయిలో వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టును నిర్దేశించింది. అది కూడా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనమే విచారణ చేపట్టాలని పేర్కొంది. అటు, హైకోర్టులో వాయిదాలు కోరవద్దంటూ అడ్వొకేట్ జనరల్ కు స్పష్టం చేసింది.

అప్పట్లోనే ఈ కేసు విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు... తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఆ విచారణకు కొనసాగింపుగానే నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News