JC Diwakar Reddy: షర్మిలకు ఏదైనా కీలక పదవి ఇచ్చుంటే ఈ సమస్య ఉండేది కాదు: జేసీ దివాకర్ రెడ్డి
- హైదరాబాదులో కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లిన జేసీ
- మీడియాతో షర్మిల అంశంలో అభిప్రాయాల వెల్లడి
- విజయమ్మకు షర్మిలపైనే ప్రేమ ఎక్కువని కామెంట్
- ప్రస్తుతం షర్మిల వార్మప్ చేస్తోందని వ్యాఖ్యలు
- త్వరలో ఏపీలో అడుగుపెడుతుందని జోస్యం
వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ స్థాపన కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ విజయమ్మకు షర్మిల అంటే చాలా ప్రేమ అని వెల్లడించారు. షర్మిలకు ఏదైనా కీలక పదవి ఇచ్చుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా మరో ఏడాదిన్నరలో షర్మిల ఏపీ రాజకీయాల్లోనూ అడుగుపెడుతుందని జోస్యం చెప్పారు.
ప్రస్తుతం షర్మిల వార్మప్ చేస్తోందని జేసీ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఏపీలో ఎంటరయ్యేందుకు ఇది కేవలం సన్నాహకమేనని అభివర్ణించారు. ఆ తర్వాత విజయవాడకు షిఫ్టవడం లాంఛనమేనని పేర్కొన్నారు. రాజన్న రాజ్యం తెలంగాణలో అవసరంలేదని, ఏపీలోనే అవసరం అన్నది షర్మిలకు తెలిసి వస్తుందని అన్నారు.
ఒకవేళ షర్మిలకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేస్తే కొత్త పార్టీ విషయంపై పునరాలోచన చేస్తుందేమో చూడాలని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలంటే కుటుంబ సభ్యులందరూ పదవులు కోరుతుంటారని, జాతీయ పార్టీలే నయమని జేసీ అభిప్రాయపడ్డారు. జేసీ దివాకర్ రెడ్డి ఇవాళ హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా అక్కడి సీనియర్లతో ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ షర్మిల అంశంలో తన అభిప్రాయాలు వినిపించారు.