Raghu Rama Krishna Raju: విశాఖకు తరలి వెళ్లడానికి ఓ మహానుభావుడు ఇప్పటికే ముహూర్తం పెట్టారట: రఘురామకృష్ణరాజు
- ఎన్నికల ఫలితాలను చూపి విశాఖకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు
- అయితే చట్ట ప్రకారం ఇది చెల్లదని వ్యాఖ్య
- రాష్ట్రంలో ప్రజాధనం దారుణంగా దుర్వినియోగమవుతోంది
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూపి, రాత్రికి రాత్రే విశాఖకు దుకాణం సర్దేయడానికి ముఖ్యమంత్రి జగన్ ప్లాన్ చేస్తున్నారని ఆయన అన్నారు. విశాఖ రాజధానికి అనుకూలంగా ప్రజలు తీర్పును వెలువరించారని... అమరావతిలో రాజధాని వద్దంటున్నారని కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పనుందని వ్యాఖ్యానించారు. విశాఖకు తరలి వెళ్లడానికి ఓ మహానుభావుడు ఇప్పటికే ముహూర్తం పెట్టారట అని అన్నారు.
అయితే చట్ట ప్రకారం ఇది చెల్లదని తెలిపారు. చట్ట ప్రకారం సెక్రటేరియట్ అమరావతిలోనే ఉంటుందని రఘురాజు చెప్పారు. మీరు పెట్టుకున్న వందలాది మంది సలహాదారులు మీకు సరైన సలహాలు ఇవ్వడం లేదా? అని జగన్ ను ప్రశ్నించారు. రాజధాని తరలింపుకు ఇప్పటి వరకు 20 సార్లు ముహూర్తం పెట్టారని... అన్నీ మధ్యలోనే ఆగిపోయాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాధనం అత్యంత దారుణంగా దుర్వినియోగం అవుతోందని అన్నారు. తనను తన నియోజకవర్గానికి వెళ్లనీయడం లేదని... మంత్రి శ్రీరంగనాథ రాజు ఆదేశాలతో తనపై ఏడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని మండిపడ్డారు.