Virat Kohli: కోహ్లీ విజృంభణ... గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసిన టీమిండియా
- అహ్మదాబాద్ లో మూడో టీ20
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా
- 46 బంతుల్లో 77 పరుగులు చేసిన కోహ్లీ
- టీమిండియా స్కోరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 రన్స్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ మరోమారు అర్ధసెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో కోహ్లీ 46 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పంత్ (25), పాండ్య (17) ఫర్వాలేదనిపించగా.... మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగుల గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది.
తొలి రెండు మ్యాచ్ లలో ఆడని రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో బరిలో దిగినా 15 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ మరోమారు పేలవ ఫాం ప్రదర్శించి డకౌట్ కాగా, మొన్న మెరుపులు మెరిపించిన ఇషాన్ కిషన్ ఈసారి 4 పరుగులతో సరిపెట్టుకున్నాడు. అయ్యర్ 9 పరుగులు చేశాడు. ఈ పోరులో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, ఆ జట్టు బౌలర్లు అందుకు తగ్గట్టే రాణించారు. మార్క్ ఉడ్ 3, క్రిస్ జోర్డాన్ 2 వికెట్లు తీశారు.