Ultra Sound: కరోనా చికిత్సకు అల్ట్రా సౌండ్ విధానం... అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం
- ఎంఐటీ పరిశోధకుల అధ్యయనం
- కరోనా కణాలపై అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీల ప్రయోగం
- స్పైక్ ప్రొటీన్ ను దెబ్బతీస్తున్న అల్ట్రాసౌండ్
- ఆర్ఎన్ఏను కూడా నాశనం చేయొచ్చంటున్న పరిశోధకులు
మానవాళి మునుపెన్నడూ చూడని ప్రాణాంతక వైరస్ కరోనా. ఈ వైరస్ సోకిన వారికి తొలినాళ్లలో ప్రత్యేకమైన చికిత్స విధానం కూడా లేదు. వ్యాధి లక్షణాల ఆధారంగానే చికిత్స చేశారు. అయితే కాలక్రమంలో కరోనా వ్యాధిపై కొన్ని ఔషధాలు మెరుగైన పనితీరు కనబర్చడంతో వాటి సాయంతో రోగులకు చికిత్స చేస్తున్నారు. తాజాగా అమెరికా పరిశోధకులు కరోనా చికిత్స కోసం అల్ట్రాసౌండ్ విధానాన్ని ప్రతిపాదించారు.
మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన పరిశోధకుల బృందం అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీలకు కరోనా వైరస్ కణాలు ఎలా ప్రతిస్పందిస్తాయో కంప్యూటర్ సిమ్యులేషన్ల ద్వారా తెలుసుకున్నారు. కనిష్టంగా 25 మెగాహెర్జ్ పౌనఃపున్యం, గరిష్టంగా 100 మెగాహెర్జ్ పౌనఃపున్యం గల ఫ్రీక్వెన్సీలను కరోనా కణాలపై ప్రయోగించారు. ఈ అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీలతో కరోనా వైరస్ కణాల ఉపరితలంపై ఉన్న స్పైక్ ప్రొటీన్ నిర్వీర్యం అవుతున్నట్టు తేలింది. ఈ విధానంలో కరోనా వైరస్ కణాలు నాశనం అవుతున్నట్టు ఎంఐటీ పరిశోధకులు గుర్తించారు.
కరోనా వైరస్ కణాల ఉపరితలాన్నే కాకుండా కణంలోని ఆర్ఎన్ఏను కూడా అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీలతో దెబ్బతీయవచ్చని, తద్వారా వైరస్ ను నిర్మూలించవచ్చని ఎంఐటీ ప్రొఫెసర్ థామస్ వీర్జ్ బికీ వెల్లడించారు.