England: ఇంగ్లండ్ ఆల్ రౌండ్ షో... మూడో టీ20లో టీమిండియా ఓటమి
- 157 పరుగుల టార్గెట్ ను ఛేదించిన ఇంగ్లండ్
- 8 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించిన వైనం
- విరుచుకుపడిన జోస్ బట్లర్
- సమష్టిగా విఫలమైన భారత జట్టు
- 2-1తో సిరీస్ లో ఇంగ్లండ్ ముందంజ
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. 157 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా ఛేదించింది. ఓపెనర్ జోస్ బట్లర్ (83 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సులు) దూకుడుగా ఆడడంతో ఇంగ్లండ్ కేవలం 2 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. బట్లర్ కు తోడు జానీ బెయిర్ స్టో (40 నాటౌట్; 5 ఫోర్లు) కూడా ధాటిగా ఆడాడు.
టీమిండియా బౌలర్లలో చహల్, సుందర్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ జాసన్ రాయ్ 9 పరుగులు చేయగా, డేవిడ్ మలాన్ 18 పరుగులకు అవుటయ్యాడు. అంతకుముందు, టాస్ గెలిచిన ఇంగ్లండ్... టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఇంగ్లండ్ బౌలర్లు సమయోచితంగా రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 77 నాటౌట్) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ మార్చి 18న అహ్మదాబాద్ లోనే జరగనుంది.