Guntur Urban Cops: గుంటూరు అర్బన్ పోలీసుల పేరుతో ఫేస్ బుక్ లో ఫేక్ ఖాతా

Cyber criminals creates fake account in the name Guntur Urban Cops

  • ఫేస్ బుక్ లో నకిలీల బెడద
  • డబ్బు కావాలంటూ సందేశాలు
  • ప్రముఖుల పేరుతో ఫేక్ అకౌంట్లు
  • మోసపోతున్న ప్రజలు

ఇటీవల కాలంలో ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో నకిలీ ఐడీల బెడద ఎక్కువైంది. ప్రముఖుల పేరిట ఫేక్ ఖాతాలు తెరిచి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ఘటనలు అధికంగా నమోదవుతున్నాయి. సామాన్యులకు ఈ సమస్య తప్పడంలేదు. తాజాగా గుంటూరు అర్బన్ పోలీసుల పేరుతోనూ ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్ ప్రత్యక్షమైంది. గుంటూరు అర్బన్ కాప్స్ పేరుతో ఈ ఖాతా నుంచి అత్యవసరంగా నగదు కావాలంటూ ఇతర ఫేస్ బుక్ వినియోగదారులకు సందేశాలు వెళుతున్నాయి.

దీనిపై గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సిబ్బందిని అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన గుంటూరు సైబర్ పోలీసులు ఆ నకిలీ ఐడీతో ఉన్న ఫేస్ బుక్ ఖాతాను తొలగించారు. దీనిపై అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి స్పందిస్తూ... ఇది నకిలీ ఖాతా అని, తాము ఎవరి నుంచి డబ్బు కోరడంలేదని స్పష్టం చేశారు. గుంటూరు అర్బన్ కాప్స్ పేరుతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులు ఎవరూ ఆమోదించవద్దని తెలిపారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాదు, సైబర్ నేరాలపై అవగాహన కోసం డయల్ 100ను సంప్రదించవచ్చని, లేక 86888 31568కి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

ఇటీవలే సైబర్ నేరగాళ్లు గుంటూరు ట్రాఫిక్ సబ్ ఇన్ స్పెక్టర్ శ్రీహరి ఫేస్ బుక్ ఖాతాను హ్యాక్ చేసి మెడికల్ ఎమర్జెన్సీ అని, డబ్బులు కావాలని అతని స్నేహితులకు సందేశాలు పంపారు. ఇలాంటివే ఫేస్ బుక్ లో నిత్యం అనేకమందికి సైబర్ మోసాలు ఎదురవుతున్నాయి.

  • Loading...

More Telugu News