Narendra Modi: కరోనా సెకండ్ వేవ్ ఆందోళనల నేపథ్యంలో.. కాసేపట్లో ముఖ్యమంత్రులతో మోదీ కీలక సమావేశం

PM Modi to hold meeting with all Chief Ministers
  • దేశ వ్యాప్తంగా మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
  • మహమ్మారి కట్టడిపై సీఎంలతో సమీక్ష నిర్వహించనున్న మోదీ
  • వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించనున్న పీఎం
భారత్ లో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దాదాపు 188 మంది కరోనా వల్ల చనిపోవడం భయాందోళలను పెంచుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించకపోతే మరోసారి లాక్ డౌన్ తప్పదని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప హెచ్చరించారు. ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోదీ ఈరోజు కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వర్చువల్ గా జరగనున్న ఈ సమావేశం కాసేపట్లో ప్రారంభం కాబోతోంది.

మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎంలతో మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రుల నుంచి సలహాలు స్వీకరిస్తూనే, రాష్ట్రాలకు కీలక సూచనలు చేయనున్నారు. దీంతోపాటు, దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ పై కూడా చర్చించనున్నారు.

గత 24 గంటల్లో భారత్ లో ప్రమాదకర స్థాయిలో 28,903 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 11 తర్వాత ఒకే రోజు అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. డిసెంబర్ 11న దేశ వ్యాప్తంగా 30,254 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మన దేశంలో 1.14 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా... 1,59,044 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 17,864 కేసులు, కేరళలో 1,970 కేసులు, పంజాబ్ లో 1,463 కేసులు, కర్ణాటకలో 1,135 కేసులు, గుజరాత్ లో 954 కేసులు నమోదయ్యాయి.
Narendra Modi
Chief Ministers
Meeting
Corona Virus
Vaccination Drive

More Telugu News