nasa: ఈ నెల 21న భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం: నాసా శాస్త్రవేత్తలు
- 2001 ఎఫ్‌వో32గా గ్రహశకలానికి పేరు
- ఆ గ్రహశకల వ్యాసం సుమారు 3,000 అడుగులు
- ప్రమాదకరమైన గ్రహశకలంగానే భావించాలంటోన్న నాసా
- అత్యధిక వేగంతో దూసుకొస్తోందని వెల్లడి
భూమికి దగ్గరగా ఓ భారీ గ్రహశకలం రానుందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తలు 2001 ఎఫ్‌వో32గా పిలుస్తోన్న ఈ భారీ గ్రహశకలం ఈ నెల 21న భూమికి దగ్గరగా 2 మిలియన్ కిలోమీటర్ల సమీపంలోకి చేరుకుంటుందని తెలిపారు.
ఈ గ్రహశకలాన్ని పరిశీలించి, దాని ద్వారా పలు విషయాలను కనుగొనడానికి శాస్త్రవేత్తలు సన్నద్ధమయ్యారు. ఈ భారీ గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు దాదాపు 20 సంవత్సరాల క్రితం గుర్తించడంతో దానికి 2001 ఎఫ్‌వో32గా పేరుపెట్టారు.
ఆ గ్రహశకల వ్యాసం సుమారు 3,000 అడుగులు ఉంటుందని చెబుతున్నారు. అది సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య మార్గాన్ని అంచనా వేశామని వారు తెలిపారు. దీంతో అది భూమికి 2 మిలియన్ కిలోమీటర్ల కంటే దగ్గరగా వచ్చే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. అయినప్పటికీ దీన్ని ప్రమాదకరమైన గ్రహశకలంగానే భావించాలని వారు అంటున్నారు.
ఇప్పటివరకు భూమికి అతి సమీపంగా వచ్చిన గ్రహశకలాలన్నింటి కంటే అత్యధిక వేగంతో ఇది దూసుకొస్తోందని చెప్పారు. గ్రహశకలంపై పడి పరావర్తనం చెందే సూర్యకాంతిని శాస్త్రవేత్తలు అధ్యయనం చేయనున్నారు. దాని ద్వారా శాస్త్రవేత్తలు దాని పరిమాణం, దానిపై ఉండే ఖనిజాలు, రసాయన కూర్పులను పరిశీలిస్తారు.
ఆ భారీ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చినప్పుడు మిగతా ప్రాంతాలతో పోల్చితే దక్షిణార్థ గోళంలో ఉన్న వారికి ఇది మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుందని తెలిపారు. కాగా, 1908, జూన్ 30న ఓ గ్రహశకలం సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతంలో భూమిని తాకిందని శాస్త్రవేత్తలు గుర్తు చేశారు.
దీంతో తుంగుస్కా ప్రాంతంలో పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం ధ్వంసమైంది. భూమిని ఢీకొట్టిన అనంతరం అది మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లిపోయిందని కొందరు శాస్త్రవేత్తలు అంటుండగా, అది మంచుతో కూడుకున్నది కావడంతో భూమిపైనే కరిగిపోయిందని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.