Yanamala: అందుకే ఆ సమావేశాన్ని బహిష్కరించాం: యనమల వివరణ
- రాజ్యాంగ స్ఫూర్తిని జగన్ తుంగలో తొక్కుతున్నారు
- వైసీపీ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా బతికే అవకాశం లేదు
- నీరో చక్రవర్తిలా జగన్ పాలిస్తున్నారు
రాష్ట్ర మానవహక్కుల సంఘం ఛైర్మన్ నియామకంపై ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాసనసభ స్పీకర్ తమ్మినేని, శాసనమండలి ఛైర్మన్ షరీఫ్, హోంమంత్రి సుచరిత హాజరయ్యారు. అయితే, శాసనసభ, మండలిలో విపక్ష నేతలైన చంద్రబాబు, యనమల హాజరుకాలేదు. దీనిపై యనమల స్పందించారు.
రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా వ్యక్తుల స్వేచ్ఛ, గౌరవానికి భంగం కలిగినప్పుడు తక్కువ ఖర్చుతో న్యాయం పొందే అవకాశాన్ని మానవ హక్కుల కమిషన్ కల్పిస్తుందని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి జగన్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతూ దౌర్జన్యాలు, దాడులు, అకృత్యాలతో నెత్తుటి పాలనను సాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగిస్తున్నారని అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా బతికే అవకాశం లేదని, తమ భావాలను కూడా వ్యక్తం చేసే పరిస్థితి లేదని చెప్పారు.
అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న మహిళలపై కూడా దాడి చేయించారని యనమల మండిపడ్డారు. మాస్కు అడిగినందుకు ఒక డాక్టర్ పై నడి రోడ్డుపై దాడి చేశారని అన్నారు. ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు కూడా లేకుండా చేశారని చెప్పారు. పోటీలో నిలబడిన వారిని కిడ్నాపులు చేసి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని విమర్శించారు. ప్రజా హక్కులను కాలరాస్తూ నీరో చక్రవర్తిలా జగన్ పాలిస్తున్నారని దుయ్యబట్టారు. మానవ హక్కులన్నా, రాజ్యాంగ హక్కులన్నా జగన్ కు గౌరవం లేదని అన్నారు. అందుకే జగన్ ఏర్పాటు చేసిన సమావేశాన్ని టీడీపీ ప్రతినిధులుగా తాము బహిష్కరిస్తున్నామని చెప్పారు.