Allahabad University: మసీదు లౌడ్ స్పీకర్ పై నిషేధం విధించాలని జిల్లా కలెక్టర్ కు అలహాబాద్ యూనివర్శిటీ వీసీ లేఖ
- లౌడ్ స్పీకర్ వల్ల నిద్రకు భంగం కలుగుతోందన్న వీసీ
- రంజాన్ సమయంలో ఉదయం 4 గంటలకే అనౌన్సుమెంట్లు ప్రారంభమవుతాయని వ్యాఖ్య
- రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్న జిల్లా కలెక్టర్
తన నివాసానికి సమీపంలో ఉన్న ఒక మసీదులో 'అజాన్' కోసం ఉపయోగించే లౌడ్ స్పీకర్లను నిషేధించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ (డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్)కు అలహాబాద్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సంగీత శ్రీవాస్తవ లేఖ రాశారు. అజాన్ వల్ల తన నిద్రకు భంగం కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. అజాన్ అయిపోయిన తర్వాత తనకు మళ్లీ నిద్ర పట్టడం లేదని చెప్పారు. దీని వల్ల తనకు తలనొప్పి వస్తోందని... తన పనితీరుపై కూడా ప్రభావం పడుతోందని అన్నారు.
రంజాన్ సమయంలో ఉదయం 4 గంటల నుంచే మైకుల్లో అనౌన్సుమెంట్లు ప్రారంభమవుతాయని, అది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పారు. తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని చెప్పారు. లేఖ కాపీలను ప్రయాగ్ రాజ్ డివిజనల్ కమిషనర్, ప్రయాగ్ రాజ్ ఎస్ఎస్పీ లకు పంపించారు. ఈ లేఖపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు సంగీత లేఖపై మిశ్రమ స్పందన వస్తోంది. ఆమెను కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయోధ్యలోని సన్యాసులు ఆమెను సమర్థించారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేయడాన్ని హనుమాన్ గర్హి పూజారి రాజు దాస్ ప్రశ్నించారు. లౌడ్ స్పీకర్లను తొలగించాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. నిర్ణీత సమయాల్లో తక్కువ శబ్దంతో అజాన్ నిర్వహించాలని అన్నారు. లౌడ్ స్పీకర్లను వాడే మసీదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంగీత లేఖపై బీజేపీ అధికార ప్రతినిధి మనీశ్ శుక్లా మాట్లాడుతూ, తమ హక్కులకు విఘాతం కలిగిస్తున్న అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం మనకు కల్పించిందని అన్నారు.
మరికొందరు వీసీ లేఖను తప్పుపడుతున్నారు. అజాన్ ఒకటి లేదా రెండు నిమిషాల సేపు మాత్రమే ఉంటుందని... ఈ మాత్రానికి అభ్యంతరం ఎందుకని అడ్వొకేట్ దారుల్ ఉలూమ్ ఫరంగి మహ్లీ ప్రశ్నించారు. వీసీ రాసిన లేఖలో సరైన తార్కికం కనిపించడం లేదని అన్నారు.