Pawan Kalyan: జనసైనికులపై మారణాయుధాలతో పాశవికంగా దాడి చేశారు... కేసులు నమోదు చేయరా?: పవన్ కల్యాణ్
- అనంతపురం జిల్లాలో జనసైనికులపై దాడి
- తీవ్ర అగ్రహం వ్యక్తం చేసిన పవన్
- వైసీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపణ
- కేసు నమోదు చేయకపోతే చట్టబద్ధంగా వెళతామని వెల్లడి
- వైసీపీ నేతల్లో అభద్రతాభావం కనిపిస్తోందన్న పవన్
అనంతపురం జిల్లా గోరంట్ల మండలం గుంటిపల్లిలో ముగ్గురు జనసైనికులపై వైసీపీ నేతలు మారణాయుధాలతో పాశవికంగా దాడి చేశారని, ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయిస్తే కేసు నమోదు చేయలేదని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేయకపోతే చట్టబద్ధంగా ముందుకెళతామని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన బలపర్చిన అభ్యర్థిగా నగేశ్ బరిలో దిగారని, ఆయనకు ఏజెంట్ గా మునీంద్ర వ్యవహరించారని, అయితే, వీరిద్దరితో పాటు జనసైనికుడు వేణుగోపాల్ పై వైసీపీ నేతలు దాడి చేసి హత్యకు యత్నించారని పవన్ వివరించారు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకపోవడాన్ని అధికారుల బాధ్యతారాహిత్యం అనుకోవాలా? లేక, వారిపై అధికార పార్టీ ఒత్తిళ్లు పనిచేశాయని అనుకోవాలా? అని ప్రశ్నించారు. జనసేన మద్దతుతో ఎన్నికల్లో నిల్చున్నందుకు హతమార్చాలని అనుకోవడం అటవిక సంస్కృతికి నిదర్శనం అని విమర్శించారు. తమకు ఎవరూ ఎదురు నిలబడకూడదు అనుకుంటే ఎన్నికలు ఎందుకని నిలదీశారు.
వైసీపీ పాలనలో ఫ్యాక్షన్ పోకడలు రాష్ట్రవ్యాప్తం అయ్యాయని, అమలాపురంలో జనసేన నేత లింగోలు పండుపై దాడి చేసి ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారని, నూజివీడులో అధికార పక్ష ఎమ్మెల్యే అనుచరులు జనసేన కార్యకర్త మండలి రాజుపై దాడి చేశారని పవన్ వెల్లడించారు. అన్నిచోట్లా తామే గెలిచామని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు జనసేన వర్గాలపై దాడికి యత్నిస్తున్నారంటే వారి గెలుపులో నిజాయతీ లేదని అర్థమవుతోందని పవన్ వ్యాఖ్యానించారు. ఈ అధికారిక దుర్మార్గాలపై పోలీసు శాఖ నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.