Supreme Court: ఆధార్ తో లింక్ కాలేదని మూడు కోట్ల రేషన్ కార్డుల రద్దు.. లోతైన విచారణ చేస్తామన్న సుప్రీం!
- ఇది తీవ్రమైన అంశమన్న సర్వోన్నత న్యాయస్థానం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
- నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం
- రేషన్ కార్డులు రద్దు చేయలేదన్న ప్రభుత్వం
ఆధార్ కార్డుతో అనుసంధానం కాని దాదాపు మూడు కోట్ల రేషన్ కార్డులను రద్దు చేయడంపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీన్ని తీవ్రమైన అంశంగా పేర్కొన్న న్యాయస్థానం.. దీనిపై తమ స్పందన తెలియజేయాలని కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఝార్ఖండ్‌కు చెందిన కొయిలీ దేవీ అనే మహిళ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
మూడు కోట్ల రేషన్ కార్డులు రద్దు చేయడం వల్ల ఆకలి చావులు నెలకొన్నాయని పిటిషనర్ తరఫున న్యాయవాది కొలిన్ అన్నారు. ఈ వాదనను అదనపు సొలిసిటర్ జనరల్ అమన్ లేఖీ ఖండించారు. రేషన్ కార్డులు రద్దు చేశామన్న వాదన తప్పని పేర్కొన్నారు. ఉభయ వర్గాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ అంశంపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
ఝార్ఖండ్‌కు చెందిన కొయిలీ దేవీ 11ఏళ్ల కుమార్తె సంతోషి 2018లో ఆకలితో అలమటించి మరణించింది. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం లేని కారణంగా 2017 మార్చి నుంచి స్థానిక అధికారులు తమకు రేషన్ సరుకులు ఇవ్వడం నిలిపివేశారని సంతోషి కుటుంబసభ్యులు అప్పట్లో ఆరోపించారు.
నిరుపేద కుటుంబమైన తమకు సరుకులు అందకపోవడంతో తిండి కూడా దొరకలేదని, అందువల్లే తమ కుమార్తె మరణించిందని కొయిలీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై 2018లోనే ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఆధార్ కారణంగా ఎవరికీ రేషన్ నిలిపివేయలేదని ప్రభుత్వం అప్పుడు కోర్టుకు తెలిపింది.