Piyush Goyal: యలహంక-పెనుకొండ రైల్వే లైనుపై ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్న... సమాధానమిచ్చిన పియూష్ గోయల్
- డబ్లింగ్ ప్రాజెక్టుపై ప్రశ్నించిన వైసీపీ ఎంపీ
- లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన రైల్వే మంత్రి
- ఏపీ సర్కారు వైఖరితో ప్రాజెక్టుపై భారం పడిందన్న మంత్రి
- రైల్వే శాఖ సొంతంగానే ప్రాజెక్టు చేపడుతుందని వెల్లడి
పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్ సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ బదులిచ్చారు. యలహంక-పెనుకొండ రైల్వే లైను డబ్లింగ్ పురోగతిపై గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. దీనికి పియూష్ గోయల్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 120 కిలోమీటర్ల డబ్లింగ్ ప్రాజెక్టుకు వ్యయం అంచనాలు రూ.1,147 కోట్లు అని వెల్లడించారు. డబ్లింగ్ ప్రాజెక్టులో 72 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ పూర్తయిందని తెలిపారు. ఇప్పటివరకు రూ.912 కోట్లు ఖర్చయినట్టు వివరించారు. 2021-22 బడ్జెట్ లో ప్రాజెక్టుకు రూ.160 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు.
ఈ రైల్వే లైన్ ఏపీ, కర్ణాటక మధ్య వస్తుందని, తమ భూభాగంలో చేపట్టే ప్రాజెక్టులో 50 శాతం భరిస్తామని ఏపీ చెప్పిందని పియూష్ గోయల్ వెల్లడించారు. అయితే ఏపీ తన వాటాలో రూ.200 కోట్లకు గాను రూ.50 కోట్లే ఇచ్చిందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో తమ వాటా ఇవ్వలేమని ఏపీ చెప్పిందని పేర్కొన్నారు. ఏపీ వైఖరి వల్లే రైల్వే ప్రాజెక్టుపై తీవ్ర వ్యయభారం పడిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సొంత నిధులతో ప్రాజెక్టు చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు.