Bharat Bandh: ఈ నెల 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రైతులు
- వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు
- ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు
- బంద్ చేపడతామన్న రైతు సంఘాల ఐక్యవేదిక
- హోలీ నాడు వ్యవసాయ చట్టాల ప్రతులు దహనం చేస్తామని వెల్లడి
జాతీయ వ్యవసాయ చట్టాలను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న రైతులు గత కొన్నినెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా రైతు సంఘాల ఐక్యవేదిక సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్కేఎమ్) ఈ నెల 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తున్నట్టు ఎస్కేఎమ్ వెల్లడించింది. హోలీ పర్వదినం సందర్భంగా వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేస్తామని రైతు సంఘం నేతలు తెలిపారు. కాగా ఈ బంద్ కు అన్ని వాణిజ్య, రవాణా, విద్యార్థి, యువత, మహిళా సంఘాలు, ఇతర వర్గాలు మద్దతు ప్రకటిస్తామని ప్రతిజ్ఞ చేశాయి.
భారత్ బంద్ గ్రామస్థాయి వరకు జరగాలని ఆలిండియా కిసాన్ సభ నాయకుడు కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. రైతుల నిరసనలు 112 రోజులుగా కొనసాగుతున్నాయని, ఇది ఓ ఘనత అని తెలిపారు.