Skin rashes: చర్మంపై దద్దుర్లు కూడా కరోనా పాజిటివ్ కు సంకేతం
- ఓ అధ్యయనంలో తేలిన ఆసక్తికర అంశం
- కరోనాను తొలి దశలోనే గుర్తించేందుకు దోహదం
- యువకుల్లో ఎక్కువగా కనిపించిన లక్షణం
- ఫలితాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితం
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఏడాది దాటింది. ఈ క్రమంలో ప్రజల్లో ఈ మహమ్మారిపై విస్తృతమైన అవగాహన ఏర్పడింది. లక్షణాల దగ్గర నుంచి చికిత్స వరకు ప్రజలు అన్నీ తెలుసుకున్నారు. ఇంకా తెలుసుకుంటూనే ఉన్నారు. అయితే, దీనిపై లోతైన పరిశోధనలు ఇంకా జరుగుతుండడంతో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
తాజాగా చర్మంపై దద్దుర్లు రావడం కూడా కరోనా వైరస్ సోకిందనడానికి ఓ సంకేతమని ఓ అధ్యయనం తేల్చింది. దగ్గు, జలుబు, జ్వరంతో పాటు చర్మంపై వచ్చే దద్దుర్లు కూడా ఓ లక్షణమని గుర్తించాలని తెలిపింది. వైరస్‌ను తొలిదశలోనే గుర్తించేందుకు ఇది ఎంతో ఉపయోగపడనుందని స్పష్టం చేసింది. అయితే, అలర్జీ వల్ల వచ్చే దద్దుర్లతో పోలిస్తే.. వైరస్ వల్ల ఏర్పడే దద్దుర్లు ఎర్రగా.. ఉబ్బినట్లుగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు అధ్యయన ఫలితాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితమైంది.
వైరస్ సోకిన వారి లక్షణాలు నమోదు చేయడం కోసం రూపొందించిన ఓ ప్రత్యేక యాప్‌లో రికార్డు చేసిన 3,36,847 మంది వివరాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ నిర్ణయానికి వచ్చారు. వీరిలో చాలా మంది చర్మంపై దద్దుర్లు ఏర్పడ్డట్లు తెలిపారు. ముఖ్యంగా యువకుల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపించిందని తేలింది. అలాగే మరో 11,544 మందిని ఆన్‌లైన్‌లో సర్వే చేశారు. వీరిలో 17శాతం మంది కరోనా సోకిన తర్వాత బయటపడ్డ తొలి లక్షణం చర్మంపై దద్దుర్లు రావడమేనని తెలిపారు. మరో 21 శాతం మంది ఇతర లక్షణాలతో పాటు ఇది కూడా ఓ దశలో కనిపించిందని పేర్కొన్నారు.