Kangeyam: 25 ఏళ్ల నాటి ఘటన రిపీటయ్యే అవకాశం.. కాంగేయం బరిలో వెయ్యిమంది రైతులు!
- నీటి సమస్య పరిష్కారం కోసం ఎన్నికల బరిలోకి రైతులు
- సీఎం హామీ ఇచ్చినా నెరవేరని వైనం
- రసవత్తరంగా మారనున్న తమిళనాడు ఎన్నికలు
నీటి విడుదలపై తమ డిమాండ్లను అధికారులు పట్టించుకోవడం లేదన్న కారణంతో ఏకంగా వెయ్యిమంది రైతులు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు తమిళనాడులోని కాంగేయం నియోజకవర్గ రైతులు నిర్ణయించారు.
పరంబికుళం-అలియార్ ప్రాజెక్టు నుంచి కాంగేయంలోని 48 వేల ఎకరాలకు తక్కువ నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో తమకు సరిపడా నీటిని విడుదల చేయాలని ఇక్కడ రైతులు గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల వెళ్లకోవిల్ బ్రాంచ్ కెనాల్ నీటి భద్రతా కమిటీ నేతృత్వంలో కొందరు రైతులు నిరాహార దీక్షకు కూడా దిగారు. ఐదు రోజుల తర్వాత ముఖ్యమంత్రి హామీ మేరకు దీక్షను విరమించారు.
అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. తమ సమస్యను తామే పరిష్కరించుకునేందుకు మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. కాంగేయం నియోజకవర్గం బరిలో ఏకంగా వెయ్యిమంది అభ్యర్థులను నిలపాలని కమిటీ నిర్ణయించింది. ఇప్పటికే వందమందికిపైగా రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. మిగతావారు కూడా నామినేషన్ల దాఖలుకు రెడీ అవుతున్నారు.
25 ఏళ్ల క్రితం అంటే 1996లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అప్పట్లో మొదకురిచి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో 1,016 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఫలితంగా అక్కడ బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 1,033కు చేరుకోవడంతో ఎన్నికను నెల రోజులపాటు ఈసీ వాయిదా వేసింది.
ఆ తర్వాత 50 పేజీల బ్యాలెట్ పత్రాల బుక్ ముద్రించి ఎన్నిక నిర్వహించారు. డీఎంకే నేత సుబ్బలక్ష్మి జగదీశన్ విజయం సాధించారు. 158 మంది అభ్యర్థులకు ఒక్కో ఓటు పోలవగా, 88 మందికి అది కూడా దక్కలేదు. 1,030 మంది డిపాజిట్ కోల్పోయారు. ఇప్పుడు కాంగేయంలోనూ వెయ్యిమంది రైతులు పోటీ చేస్తే అవే పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉంది.