BJP: ఓడినా, గెలిచినా ప్రజలతోనే: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు
- కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- రెండో స్థానంలో కొనసాగుతున్న రామచంద్రరావు
- గెలుపుపై ధీమా వ్యక్తం
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానంలో వాణీదేవి ముందంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు రెండో స్థానంలో ఉన్నారు. దీంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ తాను గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంకా చాలా రౌండ్లు మిగిలే ఉన్నాయని, తప్పకుండా తనకు మెజారిటీ వస్తుందని, విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
తొలి రౌండ్ లెక్కింపు ముగిసే సరికి సురభి వాణీదేవికి 17,439 ఓట్లు రాగా, 16,385 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు రెండో స్థానంలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 8,357 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జి.చిన్నారెడ్డి 5,082 ఓట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ స్థానం నుంచి మొత్తం 93 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. 3,57,354 ఓట్లు పోలయ్యాయి.