YSRCP: తాడిపత్రి పురపాలక సంఘం ఛైర్మన్ పీఠం టీడీపీకి.. మైదుకూరు వైసీపీకి!
- తాడిపత్రిలో అనూహ్యరీతిలో టీడీపీ గెలుపు
- ఛైర్మన్‌గా టీడీపీ కౌన్సిలర్ జేసీ ప్రభాకర్‌రెడ్డి
- మైదుకూరు మునిసిపల్ ఛైర్మన్ గా మాచునూరు చంద్ర
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పురపాలక సంఘం ఛైర్మన్ పదవిని అనూహ్యరీతిలో టీడీపీ సొంతం చేసుకుంది. దీనికి ఛైర్మన్‌గా టీడీపీ కౌన్సిలర్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా సరస్వతి ఎన్నికయ్యారు. టీడీపీకి మొత్తం 18 మంది కౌన్సిలర్లు ఉండగా, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు కూడా టీడీపీకే మద్దతు ఇచ్చారు.
కాగా, ఇటీవల ఎన్నికల్లో తాడిపత్రిలోని 36 వార్డుల్లో రెండింటిని వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. దీంతో 34 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీ 18 డివిజన్లు గెలుచుకుని సత్తా చాటగా, వైసీపీ 14, సీపీఐ, స్వతంత్రులు చెరో డివిజన్ చొప్పున గెలుచుకున్నారు.
మరోవైపు, కడప జిల్లా మైదూకూరు మునిసిపల్ ఛైర్మన్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఆ పురపాలక సంఘం ఛైర్మన్ గా మాచునూరు చంద్ర, వైస్ ఛైర్మన్ గా మహబూబ్ షరీఫ్ ఎంపికయ్యారు. ఆ పురపాలికలో వైసీపీ బలం 11, టీడీపీ బలం 12 గా ఉంది. అయితే, టీడీపీ నుంచి గెలిచిన షేక్ మహబూబి ప్రమాణ స్వీకార ఓటింగ్ కేంద్రానికి హాజరుకాలేదు. దీంతో ఆ పార్టీ బలం 11కు పడిపోవడం, అలాగే, రెండు ఎక్స్ అఫీషియో ఓట్లతో వైసీపీ బలం 13కు పెరగడంతో ఆ పీఠం టీడీపీ చేజారింది.