Congress: ఓట్ల కోసం కాంగ్రెస్‌ ఎంతకైనా దిగజారుతుంది.. అసోం ఎన్నికల ర్యాలీలో మోదీ

Congress will go to any extent to grab votes modi fires in assam election rally
  • అసోంలో ప్రచారం ప్రారంభించిన ప్రధాని
  • కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
  • ఓట్ల కోసం సిద్ధాంతాల్నీ పక్కన పెడుతుందని వ్యాఖ్య
  • బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్న మోదీ
  • మార్చి 27న తొలి దశ పోలింగ్‌
అసోంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం కాంగ్రెస్‌ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్‌ ఫ్రంట్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌.. కేరళలో అదే పార్టీతో తలపడుతోందంటూ ఆ పార్టీ విధానాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడిందని.. ఓట్ల కోసం ఎవరితోనైనా చేతులు కలిపేందుకు సిద్ధమైందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసోం నిరాదరణకు గురైందన్నారు. ఆ పార్టీ నాయకుల అవినీతి, అక్రమాల వల్ల రాష్ట్రం ఇతర ప్రాంతాలతో అనుసంధానాన్ని కోల్పోయిందని ఆరోపించారు. బీజేపీ మాత్రం అసోం ప్రజల్ని మిగతా దేశంతో ఏకం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు సైతం భారీ ఎత్తున ఊపందుకున్నాయన్నారు. ఇప్పటికే సిల్చార్‌లో మల్టీ మోడర్‌ లాజిస్టిక్ పార్క్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయన్నారు. దీని వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

అలాగే ఇటు రాష్ట్రంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు మెరుగైన ఆరోగ్య వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఆయుష్మాన్‌ యోజన పథకం కింద ఇప్పటి వరకు అసోంలో 1.5 లక్షల మంది ఉచిత వైద్యం పొందారన్నారు. అలాగే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా 27 లక్షల మంది రైతులు లబ్ధి పొందారన్నారు. 126 స్థానాలున్న అసోం అసెంబ్లీకి మార్చి 27 నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. మొత్తం మూడు దశల్లో పోలింగ్‌ జరగనుంది.
Congress
Modi
Assam
poll rally

More Telugu News