IT Raids: తమిళనాడులో ప్రత్యర్థి పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు.. రూ. 8 కోట్ల నగదు స్వాధీనం

IT searches at homes and offices of DMK MDMK MNM functionaries in Tiruppur
  • ధారాపురం నియోజకవర్గ బరిలో బీజేపీ చీఫ్ మురుగన్  
  • అక్కడి ప్రత్యర్థుల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ సోదాలు
  • ఉద్దేశపూర్వకమేనంటూ స్టాలిన్ మండిపాటు
తమిళనాడులో ఆదాయపన్ను శాఖ గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో రూ. 8 కోట్ల నగదు పట్టుబడింది. బీజేపీ తమిళనాడు చీఫ్ ఎల్ మురుగన్ తిరుప్పూరు జిల్లా ధారాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ప్రత్యర్థుల బంధువుల ఇళ్లపై ఆదాయపన్నుశాఖ అధికారులు రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 బుధవారం ఇక్కడ ఎండీఎంకే నేత కవిన్ నాగరాజ్, ఆయన సోదరుడు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) కోశాధికారి చంద్రశేఖర్, డీఎంకే నేత ధనశేఖర్ ఇళ్లు, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. బుధవారం రాత్రి వరకు సోదాలు జరగ్గా నిన్న చంద్రశేఖర్ ఇంట్లో మళ్లీ తనిఖీలు నిర్వహించారు.

ఆదాయపన్ను అధికారుల దాడులపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి మండిపడ్డారు. ప్రత్యర్థులను భయపెట్టేందుకే బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. చంద్రశేఖర్ ఓ వ్యాపారవేత్త అని, ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల ఆరోపణలపై స్పందించిన మురుగన్ దాడులకు, బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.
IT Raids
Tamil Nadu
Dharapuram constituency
Assembly polls
DMK
MDMK
MNM

More Telugu News