Pawan Kalyan: 22 మంది ఎంపీలున్న వైసీపీ ఢిల్లీ వేదికగా సమస్యను పరిష్కరించాలి: పవన్
- స్టీల్ ప్లాంటుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి
- వైసీపీ మరింత బాధ్యతతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి
- అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ సమస్యలపై చర్చించాలి
విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేసితీరుతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంటులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదని... సర్వ హక్కులు కేంద్రానివే అని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్లాంటును కాపాడుకునేందుకు కార్మికులు, ఉద్యోగులు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. ఈ అంశంపై తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ స్పందిస్తూ... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఓ వీడియో ద్వారా ఆయన ఈ మేరకు స్పందించారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళనల మధ్యే వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని... ఆ పార్టీకి 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ మరింత బాధ్యతతో స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని అన్నారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని... స్టీల్ ప్లాంట్ సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనలు, భూములు ఇచ్చిన నిర్వాసిత రైతుల సమస్యలపై చర్చ జరపాలని అన్నారు. 22 మంది ఎంపీలున్న వైసీపీ ఢిల్లీ వేదికగా స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు.