USA: సమావేశంలో నేరుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న అమెరికా, చైనా మంత్రులు
- అలస్కాలో సమావేశం
- చైనా చర్యలను ఖండించిన అమెరికా
- ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శ
- అమెరికాదే ఆధిపత్య ధోరణి అన్న చైనా
అమెరికా, చైనా మధ్య చాలా కాలం నుంచి మాటల యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఒక్కోసారి పరోక్షంగా ఆ ఇరు దేశాలు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటుండగా కొన్ని సార్లు నేరుగా మాటల యుద్ధానికి దిగుతున్నాయి. తాజాగా, ఇరు దేశాల ఉన్నతాధికారులు అలస్కాలో జరిగిన ఓ సమావేశంలో కూర్చొని పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు.
చైనా తీరు సరిగ్గా లేదని అమెరికా ప్రభుత్వ అధికారులు అనగా, తమపై దాడి చేసేందుకు కొన్ని దేశాలను అమెరికా ప్రోత్సహిస్తోందని అమెరికాపై చైనా ఆరోపణలు చేసింది.చైనాలో జింగ్‌జాంగ్‌లో ఉలిగర్ ముస్లింల పట్ల చైనా ప్రవర్తిస్తున్న తీరు సరికాదని అమెరికా ఆరోపించింది.
దానితో పాటు పలు అంశాలను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్‌లు ప్రస్తావించారు. జింగ్‌జియాంగ్ తో పాటు హాంకాంగ్, తైవాన్ లో చైనా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోందని వారు విమర్శించారు.
అమెరికాపై చైనా సైబర్ దాడులకు ప్రయత్నిస్తోందని చెప్పారు. తమ మిత్ర దేశాలపై చైనా ఆర్థిక ప్రతికూల చర్యలకు దిగుతున్నట్లు బ్లింకెన్ ఆరోపించారు. ప్రపంచ సుస్థిరతను చైనా చర్యలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. వారి వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, విదేశాంగ శాఖ కార్యదర్శి యాంగ్ జిలేచి తిప్పికొట్టారు.
అమెరికానే ప్రతి చోటా సైనిక చర్యకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఇతర దేశాల ఆధిపత్యాన్ని అణగదొక్కే ధోరణితో ఆ దేశం చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారు. పలు దేశాల మధ్య వాణిజ్య బంధాలను దెబ్బతీస్తోందని, అమెరికాలోనే మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉందని ఆరోపించారు.