SKY: కొన్ని విషయాలు నా చేతుల్లో లేవు: క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్
- వివాదాస్పద ఔట్ పై స్పందించిన యువ బ్యాట్స్ మన్
- అలా ఔటైనందుకు చింతేమీ లేదని కామెంట్
- సమయం వస్తే అవకాశాలూ వస్తాయని వ్యాఖ్య
ఇంగ్లండ్ తో నాలుగో టీ20లో తాను ఔటైన తీరుపై యువ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బంతి నేలను తాకినా ఫీల్డ్ అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ నిర్ణయానికే కట్టుబడి ఔటిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దుమారం రేగుతోంది. అయితే, అలా ఔటైనందుకు తనకేమీ అసంతృప్తిగానీ, చింతగానీ లేదని సూర్య అన్నాడు. కొన్ని విషయాలు తన చేతుల్లో ఉండవన్నాడు. తన నియంత్రణలో ఉండే వాటినైతే అదుపులో పెట్టగలనేమోగానీ, తన చేతుల్లో లేని వాటిపై తానేం చేయగలనని అన్నాడు.
‘‘నా ఆట పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. నేను అనుకున్న ప్రణాళిక ప్రకారమే బ్యాటింగ్ కు వెళ్లాను. ఆ ప్రణాళికను పక్కాగా అమలు చేశాను. ఐపీఎల్ లో గత రెండు మూడు సీజన్ల నుంచి ఆర్చర్ ను చూస్తున్నాను. కొత్త బ్యాట్స్ మన్ కు అతడి బౌలింగ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అతడికి ప్రణాళికలున్నట్టే.. నాకూ నా ప్రణాళికలుంటాయి’’ అని అన్నాడు.
మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే గొప్ప అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ కు అవకాశం దక్కకపోవడంపైనా స్పందించాడు. సమయం వచ్చినప్పుడు అవకాశాలు వాటంతట అవే వస్తాయని, అప్పుడు రెండు చేతులతో వాటిని ఒడిసిపట్టుకోవాలని అన్నాడు. ఆటపై తనకున్న తపనే తనను ఇక్కడి దాకా తీసుకొచ్చిందని సూర్య చెప్పాడు. కష్టపడి సాధన చేయడమే తనకు తెలుసన్నాడు. ఫిట్ నెస్, నైపుణ్యాల మీదే ఎక్కువ దృష్టి పెట్టి వాటిని మెరుగుపరచుకున్నానని వివరించాడు.