Team India: ‘సాఫ్ట్​ సిగ్నల్​’పై కోహ్లీ అసహనం

Why is soft signal so important Virat Kohli questions
  • అదో సంక్లిష్టమైన వ్యవహారమంటూ అసంతృప్తి
  • సూర్య ఔట్ ను ప్రశ్నించిన టీమిండియా కెప్టెన్
  • ఫీల్డర్ కే తెలియనప్పుడు అంపైర్ కు ఎలా తెలుస్తుందని ప్రశ్న
  • నిబంధనలను సరళం చేయాలని సూచన
  • ఇలాంటివి ఆట గతినే మార్చేస్తాయని కామెంట్
అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ తీసుకున్న సాఫ్ట్ సిగ్నల్ నిర్ణయాన్ని తోసిపుచ్చాలంటే ‘కచ్చితమైన ఆధారాలు’ అవసరమన్న వ్యాఖ్యలతో విభేదించాడు. ఇలాంటి సంక్లిష్ట నిర్ణయాలు మంచిదికాదని, ఆ నిబంధనలను మరింత సులభతరం చేయాలని అన్నాడు. దాని వల్ల కీలకమైన మ్యాచ్ లలో జట్లకు నష్టం కలగకుండా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్ తో నాలుగో టీ20 సందర్భంగా సామ్ కరన్ బౌలింగ్ లో సూర్య కుమార్ యాదవ్ షాట్ ఆడగా.. మలన్ క్యాచ్ పట్టిన సంగతి తెలిసిందే. అయితే, క్యాచ్ పై అనుమానం ఉండడంతో ఫీల్డ్ అంపైర్.. మూడో అంపైర్ కు నివేదించాడు. ‘సాఫ్ట్ సిగ్నల్’ అవుట్ అని చెప్పాడు. రివ్యూలో బంతి నేలను తాకుతున్నట్టు తేలినా మూడో అంపైర్.. ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ నిర్ణయానికే కట్టుబడి అవుటిచ్చాడు.

మ్యాచ్ లో భారత్ 8 పరుగుల తేడాతో గెలిచినా.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టెస్ట్ సిరీస్ లో జరిగిన విషయాన్ని గుర్తు చేశాడు. ‘‘టెస్ట్ సిరీస్ లో అజింక్యా రహానే పట్టిన క్యాచ్ క్లియర్ గానే ఉన్నా.. అనుమానం ఉందని చెప్పడంతో థర్డ్ అంపైర్ కు నివేదించారు. ఫీల్డర్ కే అనుమానం వచ్చినప్పుడు అంపైర్ కు మాత్రం అది ఔటని కచ్చితంగా ఎలా తెలుస్తుంది? కాబట్టి సాఫ్ట్ సిగ్నల్ అనేది ఓ సంక్లిష్టమైన వ్యవహారం. ‘అంపైర్ కాల్’ లాగానే అంపైర్లకూ ‘ఐ డోంట్ నో’ కాల్ ఎందుకు ఉండకూడదు? ఆటలో నిబంధనలను సరళతరం చేయాల్సిన అవసరం ఉంది’’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఇలాంటి నిర్ణయాలే ఆట గతిని మార్చేస్తాయని, ఈరోజంటే తాము గెలిచామని, రేపు వేరే జట్టుకూ ఇలాగే జరిగి ఓడిపోతే పరిస్థితి ఏంటని కోహ్లీ ప్రశ్నించాడు.
Team India
Virat Kohli
Soft Signal

More Telugu News