mlc: ఎమ్మెల్సీ ఎన్నికల ట్రెండుపై స్పందించిన తీన్మార్ మల్లన్న
- రెండో ప్రాధాన్యత ఓటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడుతుంది
- ఓట్లు నాకే పడే అవకాశం ఉంది
- ఫలితాలు చాలా సంతృప్తినిచ్చాయి
- ప్రజల సమస్యలపై పోరాడుతున్నా
తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రధాన పోటీదారుగా స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న నిలవగా, మూడో స్థానంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం నిలిచిన విషయం తెలిసిందే. పోలైన ఓట్లలో ఏ అభ్యర్థికి సగానికి పైగా ఓట్లు వస్తాయో వారు విజేతగా నిలుస్తారు.
తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికీ సగానికి పైగా ఓట్లు రాకపోవడంతో తీన్మార్ మల్లన్న, కోదండరాంకు విజయంపై ఆశలు నెలకొన్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లు అధికంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి పడ్డాయి కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లు మల్లన్న లేదా, కోదండరాంకు అధికంగా వచ్చే అవకాశం ఉంది.
దీనిపై తీన్మార్ మల్లన్న స్పందించారు. రెండో ప్రాధాన్యత ఓటు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తనకే పడే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తొలి ప్రాధాన్య ఓట్ల ఫలితాలు తమకు చాలా సంతృప్తినిచ్చాయని మీడియాకు చెప్పారు. తాను తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడుతున్నానని చెప్పారు.
తాను సత్యం వైపు నిలబడ్డానని, డబ్బులు ఖర్చు పెట్టి పోటీ చేసిన వారు అసత్యం వైపు ఉన్నారని చెప్పుకొచ్చారు. గత ఏడేళ్లుగా రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తాను చేసిన పాదయాత్రలో పట్టభద్రులను కలవలేదని, వారి తల్లిదండ్రులను కలిశానని తెలిపారు.
తాను వారి సమస్యలను దగ్గరగా చూశానని అన్నారు. తాను ఇకపై ప్రభుత్వ తీరుపై మరింత పోరాడతానని చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మల్లన్న ప్రధాన పార్టీలకు సైతం గట్టి పోటీనిస్తుండడం గమనార్హం.