Rahul Gandhi: అసోంలో అధికారంలోకి వస్తే సీఏఏని అమలు చేయం: రాహుల్ గాంధీ
- అసోం ఎన్నికల ప్రచారంలో హామీ
- దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని ఆగ్రహం
- యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు
అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేయబోమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శుక్రవారం అసోంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాగ్ పూర్ లోని ఓ బలగం దేశం మొత్తాన్ని శాసించేందుకు ప్రయత్నిస్తోందని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
‘‘దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారు. యువతకు ఉద్యోగాల్లేవు. రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. సీఏఏని తీసుకొచ్చారు. అసలు భారత్ అంటే ఏంటి? వివిధ సంస్కృతులు, భాషలు, మతాల సమ్మేళనమే భారత్. అసోం ప్రజలు ఢిల్లీకి వచ్చినంత మాత్రాన.. వారి సంస్కృతి, కట్టుబాట్లు, భాష, చరిత్రను వదిలేయాలని చెప్పలేం. అలా చెప్పిన రోజు వచ్చిందంటే.. భారత్ అనే సిద్ధాంతమే అంతమైపోయినట్టు’’ అని అన్నారు.
ప్రజాస్వామ్యమంటే అసోం గొంతుకలే అసోంను నియంత్రించడమని యువత గుర్తించాలని పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి రావాలని, రాష్ట్రం కోసం పోరాడాలని సూచించారు. విద్యార్థులు లేకపోతే ప్రజాస్వామ్యానికి విలువ లేనట్టేనన్నారు. రాష్ట్రం దోపిడీకి గురవుతోందని భావిస్తే వెంటనే రాజకీయాల్లోకి వచ్చి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాళ్లు, లాఠీలతో కాకుండా ప్రేమతో పోరాటం చేయాలన్నారు.