Corona Virus: తొలి కేసు నమోదవడానికి రెండు నెలల ముందు నుంచే చైనాలో కరోనా ఉంది: కాలిఫోర్నియా వర్సిటీ అధ్యయనం
- వుహాన్ లో మొదటగా కరోనా గుర్తింపు
- డిసెంబరులో తొలి కేసు నమోదు
- అక్టోబరు నుంచే చైనాలో కరోనా ఉందన్న పరిశోధకులు
- కాలక్రమంలో కొంతమేర కరోనా అంతరించిందని వెల్లడి
కాలిఫోర్నియా శాన్ డియాగో యూనివర్సిటీ పరిశోధకులు కరోనా వ్యాప్తి, వైరస్ ఉనికి ప్రారంభం వంటి అంశాలపై ఆసక్తికర అధ్యయనం చేశారు. కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకుల అధ్యయనం 'జర్నల్ సైన్స్' అనే మ్యాగజైన్ లో ప్రచురితమైంది. చైనాలోని వుహాన్ లో తొలి కరోనా కేసు 2019 డిసెంబరు నెలాఖర్లో నమోదు కాగా, అంతకు రెండు నెలల ముందు నుంచే కరోనా చైనాలో ఉండి ఉండొచ్చని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు.
దీనిపై అధ్యయనంలో పాలుపంచుకున్న అసోసియేట్ ప్రొఫెసర్ జోయెల్ ఓ వెర్ట్ హీమ్ మాట్లాడుతూ, "కరోనా ఉనికి వెల్లడి కాకముందు అది ఎప్పటి నుంచి చైనాలో వ్యాప్తిలో ఉందనే విషయం గుర్తించడానికి ఈ అధ్యయనం చేపట్టాం" అని వెల్లడించారు.
ఈ అధ్యయనం కోసం తాము... లాక్ డౌన్ ముందు వుహాన్ లో కరోనా ఎలా వ్యాప్తి చెందింది? చైనాలో కరోనా వైరస్ జన్యు వైవిధ్యం ఎలా ఉంది? చైనాలో తొలినాళ్లలో వెలుగు చూసిన కరోనా కేసుల నివేదికల పరిశీలన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. వీటన్నింటిని విశ్లేషించిన పిదప 2019 అక్టోబరు నుంచి హుబెయి ప్రావిన్స్ లో కరోనా వ్యాప్తి జరిగిందన్న అంశం గుర్తించామని వెర్ట్ హీమ్ వివరించారు.
ఈ పరిశోధన నిమిత్తం కాలిఫోర్నియా శాన్ డియాగో వర్సిటీ నిపుణులు మోలిక్యులర్ క్లాక్, సిమ్యులేషన్ విధానాలను ఉపయోగించారు. అయితే, కాలక్రమంలో జన్యు ఉత్పరివర్తనాలకు లోనైన కరోనా వైరస్ మరింత ఉద్ధృతమైన వ్యాప్తికి కారణం కాకుండానే కొంతమేర అంతరించిపోయిందని ఈ అధ్యయనంలో వివరించారు.