Nikhat Zareen: వరల్డ్ చాంపియన్ బాక్సర్ ను మట్టికరిపించిన తెలంగాణ అమ్మాయి
- ఇస్తాంబుల్ లో బాస్ఫరస్ బాక్సింగ్ టోర్నీ
- సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన నిఖత్ జరీన్
- క్వార్టర్ ఫైనల్లో నజీమ్ కైజాబేపై విజయం
- అంతకుముందు ప్రీక్వార్టర్స్ లోనూ వరల్డ్ చాంపియన్ పై గెలుపు
టర్కీలోని ఇస్తాంబుల్ లో జరుగుతున్న బాస్ఫరస్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ సంచలనాల మోత మోగిస్తోంది. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ జరీన్ రెండుసార్లు వరల్డ్ చాంపియన్ నజీమ్ కైజాబే (కజకిస్థాన్)ను ఓడించింది. ఈ విజయంలో నిఖత్ 51 కిలోల విభాగంలో సెమీఫైనల్స్ చేరింది.
అంతకుముందు, ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోనూ నిఖత్ 2019 వరల్డ్ చాంపియన్ పాల్ట్ సెవా ఎక్తరీనా (రష్యా)ను మట్టికరిపించడం విశేషం. ఇవాళ్టి క్వార్టర్ ఫైనల్స్ లోనూ అదే తెగువ చూపించిన తెలంగాణ తేజం 4-1తో నెగ్గింది. సెమీస్ చేరడం ద్వారా నిఖత్ జరీన్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ఇదే ఊపు కొనసాగిస్తే మాత్రం పసిడి పతకం ఖాయమని చెప్పొచ్చు. అదే సమయంలో ఇతర భారత మహిళా బాక్సర్లు తమ కేటగిరీల్లో పరాజయం పాలయ్యారు.