Palk Strait: పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన హైదరాబాద్ మహిళ శ్యామల
- 13.43 గంటల్లోనే ఈదిన శ్యామల
- ప్రపంచంలోనే రెండో మహిళగా గుర్తింపు
- మహిళల విజయమన్న శ్యామల
పాక్ జలసంధిని 30 కిలోమీటర్ల మేర ఈదిన ప్రపంచంలోనే రెండో మహిళగా హైదరాబాద్కు చెందిన గోలి శ్యామల రికార్డులకెక్కారు. తమిళనాడు, శ్రీలంకలోని జాఫ్నా జిల్లాలను పాక్ జలసంధి కలుపుతుంది. నిన్న ఉదయం 4.15 గంటలకు శ్రీలంక తీరంలో తన సాహసకృత్యాన్ని ప్రారంభించిన శ్యామల ఏకబిగిన 13.43 గంటల్లోనే ఈది రామేశ్వరంలోని ధనుష్కోడి చేరుకున్నారు.
శ్యామల బహుముఖ ప్రజ్ఞాశాలి. యానిమేషన్ చిత్రాల నిర్మాతగా, డైరెక్టర్గా, రచయితగా పలు పాత్రలు పోషిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఈతలో శిక్షణ ప్రారంభించారు. గతేడాది నవంబరులో గంగానదిలో 30 కిలోమీటర్ల దూరాన్ని 110 నిమిషాల్లోనే ఈది ఆరో స్థానంలో నిలిచారు. అలాగే, గతేడాది దక్షిణ కొరియాలోని గ్వాన్జులో జరిగిన ఫినా వరల్డ్ మాస్టర్స్ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. 2012లో పాక్ జలసంధిని 12.30 గంటల్లోనే ఈదిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది వద్ద శ్యామల శిక్షణ పొందుతున్నారు. శ్యామల తన విజయాన్ని మహిళల విజయంగా అభివర్ణించారు.