BJP: టీఎంసీ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు.. విధ్వంసం సృష్టించిన బీజేపీ కార్యకర్తలు
- టికెట్ల కేటాయింపు విషయంలో కార్యకర్తల అసంతృప్తి
- పార్టీ కార్యాలయాల్లో విధ్వంసం, ఫర్నిచర్ ధ్వంసం
- నష్ట నివారణ చర్యల్లో అమిత్ షా
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన 22 మందికి టికెట్లు కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల టైర్లు కాల్చి నిరసనలకు దిగారు. కొన్ని చోట్ల బీజేపీ కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాల్డా, జల్పాయ్‌గురి, ఉత్తర, దక్షిణ పరగణాలు, డమ్‌డమ్, అసన్‌సోల్, హుగ్లీ, హౌరా, అలీపుర్దార్, కూచ్‌బెహర్ జిల్లాల్లో కార్యకర్తలు తిరుగుబాటుకు దిగారు. అభ్యర్థులను మార్చాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. దిగి రాకుంటే సొంతపార్టీ అభ్యర్థులను ఓడిస్తామని హెచ్చరించారు.
విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసోం నుంచి నేరుగా కోల్‌కతా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర నేతలకు చీవాట్లు పెట్టారు. కేంద్రం నుంచి సీనియర్ నేతల బృందాన్ని రప్పించి అసంతృప్తి రగులుకున్న ప్రాంతాలకు పంపారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు నేతలను పిలిచి సమస్యపై చర్చించాలని, పరిస్థితిని అదుపు చేయాలని ఆదేశించారు.