Saudi Arabia: పాకిస్థాన్ మహిళలను పెళ్లి చేసుకోవడంపై నిషేధం విధించిన సౌదీ అరేబియా
- నాలుగు దేశాల మహిళలను పెళ్లాడటంపై నిషేధం విధించిన సౌదీ
- జాబితాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్
- విదేశీ మహిళను పెళ్లాడాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
ఇటీవలి కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్న సౌదీ అరేబియా... మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన పురుషులు పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్ దేశాలకు చెందిన మహిళలను పెళ్లి చేసుకోవడంపై నిషేధం విధించింది. ఈ మేరకు పాకిస్థాన్ కు చెందిన 'డాన్' పత్రిక కథనాన్ని ప్రచురించింది. అధికారిక లెక్కల ప్రకారం ఈ నాలుగు దేశాలకు చెందిన దాదాపు 5 లక్షల మంది సౌదీలో ఉన్నారు.
సౌదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనతో ఆ దేశ పురుషులు విదేశీ మహిళలను పెళ్లి చేసుకోవడం కష్టతరంగా మారిందని 'మక్కా డైలీ' దినపత్రిక వెల్లడించింది. విదేశీయులను తమ దేశ పురుషులు పెళ్లి చేసుకోవడాన్ని ఆపేందుకే సౌదీ ఈ నిర్ణయం తీసుకుందని 'డాన్' తెలిపింది.
విదేశీ మహిళను పెళ్లాడాలనుకునే వారు ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని మక్కా పోలీస్ డైరెక్టర్ మేజర్ జనరల్ ఆసఫ్ అల్ ఖురాషీ తెలిపారు. విడాకులు తీసుకున్న పురుషులు ఆరు నెలలలోపు పెళ్లి కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబోమని చెప్పారు.
పెళ్లి చేసుకోవాలనుకునే వారికి 25 ఏళ్లకు పైగా వయసుండాలని, దరఖాస్తుతో పాటు స్థానిక జిల్లా మేయర్ సంతకం చేసిన తమ గుర్తింపు పత్రాలను సమర్పించాలని తెలిపారు. ఒకేవేళ సదరు వ్యక్తికి పెళ్లై మరో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లు... తన భార్య వికలాంగురాలా, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారా? లేక ఆరోగ్యంగా ఉన్నారా? అనే దానికి సంబంధించి హాస్పిటల్ నుంచి తీసుకున్న రిపోర్ట్ ను జతచేయాలని చెప్పారు.