Mukesh Ambani: పీపీఈ కిట్ వేసుకుని.. తలకు కర్చీఫ్ కట్టి.. సినిమాను తలపించిన అంబానీ ఇంటి ముందు సీన్ రీకన్ స్ట్రక్షన్

NIA make Sachin Vaze wear PPE walk outside Ambani residence to recreate scene

  • రాత్రి 10.40 గంటలకు యాంటీలియా ముందు దర్యాప్తు
  • నిందితుడు సచిన్ వాజేతో ఎన్ఐఏ సీన్ రీకన్ స్ట్రక్షన్
  • దాదాపు మూడు గంటలు సాగిన విచారణ

అది ముంబైలోని ఓ వీధి.. శుక్రవారం రాత్రి టైం 8 గంటలు కావొస్తోంది.. రోడ్డంతా బ్లాక్ చేశారు. అంతా హడావుడిగా ఉంది. కారుపై ఓ వ్యక్తి నిలబడ్డాడు. అక్కడికి కొంచెం దూరంలో బిల్డింగ్ పై మరో వ్యక్తి నిలుచుని అంతా చూస్తున్నాడు. ప్రజలెవరూ బయటకు రావొద్దని ఆర్డర్.

టైం 10.40 గంటలైంది.. ఓ కారొచ్చి ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి పీపీఈ కిట్ వేసుకుని కారు దిగి నడుచుకుంటూ వెళ్లాడు. ఒకట్రెండు సార్లు అలాగే చేశాడు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ తంతంతా.. ఏదో సినిమా షూటింగ్ కోసం కాదు. ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలున్న కారును పెట్టిన కేసులో నేరం ఎలా చేశాడో తెలుసుకునేందుకు చేసిన సీన్ రికన్ స్ట్రక్షన్ ఇది.  

అంబానీ నివాసం యాంటీలియా ముందు శుక్రవారం రాత్రి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఫోరెన్సిక్ అధికారులు.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి సచిన్ వాజేతో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సచిన్ వాజేకు దీనితో లింకులున్నాయని ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం వాజేను తీసుకుని యాంటీలియా వద్దకు వచ్చారు.

కారులో పీపీఈ కిట్ వేయించి, తలకు హ్యాండ్ కర్చీఫ్ కట్టించిన అధికారులు.. సీసీటీవీ ఫుటేజీల్లో ఎక్కడి నుంచైతే వాజే నడిచినట్టు కనిపించిందో అక్కడి నుంచే మళ్లీ నడిపించారు. మళ్లీ అక్కడి నుంచి వెనక్కు రమ్మన్నారు. ఆ టైంలో వాజే కాస్త కళ్లు తిరిగి పడిపోయినట్టు చేశాడు. వెంటనే అధికారులు ఏమైందని అడగడంతో.. అంతా బాగానే ఉందని చెప్పాడు. ఆ తతంగాన్ని మొత్తం వీడియో తీశారు. ఇక, సీన్ రీకన్ స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో అటుగా వచ్చే వాహనాలు, మీడియా కెమెరాల లైట్లను అధికారులు బంద్ చేయించారు.

  • Loading...

More Telugu News