America: అది నిజమని తేలితే టెస్లాను శాశ్వతంగా మూసివేస్తా.. ఎలన్ మస్క్ సవాల్
- టెస్లా కార్లను గూఢచర్యానికి వినయోగించొచ్చనే అనుమానాలు
- మిలిటరీ ప్రాంతాల్లో టెస్లా కార్లను నిషేధించిన చైనా
- కారులో ఉండే జీపీఎస్‌ను యాక్సెస్ చేసే అవకాశం ఉందని ఆందోళన
- కంపెనీ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడొచ్చని అంచనా
టెస్లా కార్లను చైనాలో గూఢచర్యానికి ఉపయోగిస్తున్నట్లు తేలితే తన కంపెనీని శాశ్వతంగా మూసివేస్తానని సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ అన్నారు. తమ ఉత్పత్తులను వినియోగించే వారి సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. చైనాలో మిలిటరీ స్థావరాలు, వాటి పరిసర ప్రాంతాల్లో టెస్లా కార్లను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాకు చెందిన ఓ వ్యాపార వేదిక శనివారం నిర్వహించిన ఓ వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
టెస్లా కార్లలో కెమెరా, జీపీఎస్, రాడార్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే వీటిలో నమోదయ్యే సమాచారాన్ని ఎవరైనా యాక్సెస్ చేస్తే కారు ఎక్కడెక్కడ సంచరిస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని మిలిటరీ సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందన్న అనుమానంతో చైనా టెస్లా కార్లను మిలిటరీ ప్రాంతాల్లో నిషేధించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు అమెరికా వెలుపల టెస్లాకు ఉన్న ఒకేఒక్క తయారీ కేంద్రం చైనాలోని షాంఘైలో ఉంది. టెస్లా కార్లకు చైనా అతిపెద్ద మార్కెట్. 2020లో సంస్థ అమ్మకాల్లో 30 శాతం ఇక్కడే నమోదయ్యాయి. టెస్లా మోడల్ 3 కార్లకు అక్కడ భారీ ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.