Narendra Modi: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోదీ సందేశం
- ఇమ్రాన్ ఖాన్ కు కరోనా
- ఇటీవల చైనీస్ వ్యాక్సిన్ తీసుకున్న ఇమ్రాన్
- అయినప్పటికీ పాజిటివ్
- ఆరోగ్యం సంతరించుకోవాలంటూ మోదీ ట్వీట్
పాకిస్థాన్ ప్రధానమంత్రి, తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కరోనా బారినపడడం తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ కు కరోనా పాజిటివ్ అన్న విషయాన్ని పాకిస్థాన్ అత్యున్నత వైద్య అధికారి ఫైజల్ సుల్తాన్ వెల్లడించారు. కరోనా సోకడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం తన నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఇమ్రాన్ త్వరగా కోలుకోవాలంటూ ప్రపంచ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇమ్రాన్ ఖాన్ కు ప్రత్యేక సందేశం పంపారు. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. కొవిడ్-19 నుంచి కోలుకుని ఆరోగ్యవంతులై తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇమ్రాన్ కు కరోనా సోకడం పాక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇటీవలే చైనీస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినాగానీ కరోనా రావడంతో ఆ వ్యాక్సిన్ పై సందేహాలకు ఆయన కేంద్రబిందువుగా మారారు. పాకిస్థాన్ లో ఇప్పటివరకు 6.23 లక్షల మంది కరోనా బారినపడగా, 5.80 లక్షల మంది కోలుకున్నారు.