Shiv Sena: ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి: హోం మంత్రి​ మీద ఆరోపణలపై శివసేన నేత సంజయ్​ రౌత్​

CP letter is a bomb at least now should introspect on this says Raut

  • మాజీ సీపీ లేఖలో నిజానిజాలు తేల్చాలని కామెంట్
  • పరంబీర్ సింగ్ మంచి అధికారి అని వ్యాఖ్య
  • కూటమి సభ్యులు నేల విడిచి సాము చెయ్యొద్దని సూచన
  • ప్రభుత్వం బాగానే పనిచేస్తుందన్న సంజయ్ రౌత్
  • కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉందని కామెంట్
  • పార్టీ నేతలను ఢిల్లీకి రమ్మన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
  • అనిల్ దేశ్ ముఖ్ వ్యవహారంపై నేటి మధ్యాహ్నం భేటీ

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ మీద వచ్చిన ఆరోపణలపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహా వికాస్ అగాఢీ (మహాకూటమి) ఏర్పాటులో చిన్న పాత్ర పోషించిన వారికీ ఈ ఆరోపణలు షాక్ కలిగించేవేనన్నారు. రెస్టారెంట్లు, బార్ల నుంచి వసూళ్లు చేసేందుకు అనిల్ దేశ్ ముఖ్ టార్గెట్ పెట్టారని, నెలకు రూ.100 కోట్లకు తగ్గకుండా కలెక్షన్లుండాలన్నారని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ (సీపీ) పరంబీర్ సింగ్ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖలో ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఆదివారం నాశిక్ లో మాట్లాడిన సంజయ్ రౌత్.. ఆ ఆరోపణలు చాలా తీవ్రమైనవన్నారు. మంత్రులపై ఇలాంటి ఆరోపణలు రావడం చాలా షాక్ కలిగించేదన్నారు. ఏదేమైనా ఆ లేఖ ఓ ‘బాంబ్’ అని అన్నారు. అయితే, ఆ ఆరోపణల్లో నిజానిజాలెంతన్నది తేల్చాల్సిన అవసరముందన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్, ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అధినేత శరద్ పవార్ దీనిపై దృష్టి పెట్టాలన్నారు.

కూటమిలోని ప్రతి భాగస్వామి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎవ్వరూ నేల విడిచి సాము చెయ్యరాదని, అందరూ నేలపైనే ఉండాలని అన్నారు. ప్రభుత్వం బాగానే పనిచేస్తోందని, అయితే కొన్ని మరమ్మతులు అవసరమని అన్నారు. మాజీ సీపీ పరంబీర్ సింగ్ చాలా మంచి అధికారి అని, ఆయన రాసిన లేఖపై దర్యాప్తు చేయించాలని, అనిల్ దేశ్ ముఖ్ ఆ ఆదేశాలు ఎప్పుడిచ్చారో తేల్చాలని సంజయ్ రౌత్ అన్నారు.

కాగా, ఈ విషయంపై శరద్ పవార్ తో చర్చించేందుకు ఢిల్లీ వెళ్తానని రౌత్ చెప్పారు. ఈ విషయంలో ఆయన సరైన నిర్ణయమే తీసుకుంటారన్నారు. మరోవైపు, డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత, తన సోదరుడు అజిత్ పవార్, ఎన్సీపీ రాష్ట్రాధ్యక్షుడు, మంత్రి జయంత్ పాటిల్ ను ఢిల్లీ రావాల్సిందిగా పవార్ ఆదేశించారు. ఈ రోజు మధ్యాహ్నం వారితో ఆయన సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News