COVID19: ‘వ్యాక్సిన్​ మైత్రి’కి ఆటంకం: అనుకున్న టైంకు కరోనా టీకాలు ఇవ్వలేమన్న సీరమ్​!

SII fails to deliver New Delhis vaccine diplomacy hits hurdle

  • ఒప్పందం చేసుకున్న దేశాలకు లేఖలు
  • బ్రెజిల్, మొరాకో, సౌదీ అరేబియాలకు సమాచారం
  • అగ్ని ప్రమాదంతో ఉత్పత్తి తగ్గిందని వెల్లడి
  • అసహనం వ్యక్తం చేసిన ఆయా దేశాలు
  • డబ్బులు కట్టాక లేట్ అవుతుందంటే ఎట్లా అని నిలదీత

‘వ్యాక్సిన్ మైత్రి’ పేరిట విదేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తోంది. అందులో కొన్ని డోసులను ఉచితంగా ఇస్తోంది. మరికొన్ని కోట్ల డోసులను విక్రయిస్తోంది. అయితే, ఇప్పుడు ఆ వ్యాక్సిన్ మైత్రికి ఆటంకాలు ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఆస్ట్రాజెనికా–ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ను కొవిషీల్డ్ పేరిట సీరమ్ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ దేశాలతో కొవిషీల్డ్ ఎగుమతిపై సీరమ్ ఒప్పందాలు చేసుకుంది. బ్రెజిల్, మొరాకో, సౌదీ అరేబియా వంటి దేశాలతో ఒప్పందం ఉంది.

అయితే, ఒప్పందం ప్రకారం ఇప్పటికే కొన్ని డోసులను పంపిన సీరమ్.. మిగతా డోసులను పంపేందుకు మాత్రం ఆలస్యమవుతుందని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని బ్రెజిల్, మొరాకో, సౌదీ అరేబియాలకు సీరమ్ సీఈవో అదర్ పూనావాలా తెలియజేశారు. ‘‘ఆస్ట్రాజెనికా టీకాను సరఫరా చేసేందుకు వివిధ దేశాలతో ఒప్పందం చేసుకున్నాం. డిమాండ్ కు తగ్గట్టుగా ఉత్పత్తి సామర్థ్యాన్నీ పెంచాం. అయితే, మా ఉత్పత్తి ప్లాంట్లకు చెందిన ఓ భవనంలో అగ్ని ప్రమాదం వల్ల కరోనా టీకాల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. నెలవారీ ఉత్పత్తి సామర్థ్యంపై ప్రభావం పడింది’’ అని పేర్కొంటూ బ్రెజిల్ కు పూనావాలా లేఖ రాశారు. మొరాకో, సౌదీ అరేబియాల వ్యాక్సినేషన్ అధికారులకు ఈ నెల ప్రారంభంలో అలాంటి లేఖలే రాశారు.

బ్రెజిల్ కు 2 కోట్ల డోసులను సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్న సీరం.. 40 లక్షల డోసులను పంపించింది. అలాగే మొరాకోతో 2 కోట్ల డోసులకు ఒప్పందం చేసుకున్నా.. 70 లక్షలే పంపింది. సౌదీ అరేబియాకు 2 కోట్ల డోసులకు గానూ 30 లక్షల డోసులను సరఫరా చేసింది. అయితే, ఇప్పుడు సీరం లేఖతో ఆయా దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్లకు డబ్బులు కట్టేశామని, ఇప్పుడు ఆలస్యమవుతుందంటే ఒప్పందాన్ని అగౌరవపరచడమేనని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమ దేశాల్లో వ్యాక్సినేషన్ కు అడ్డంకులు ఏర్పడతాయని అసహనం వ్యక్తం చేశాయి.

నిజానికి కొత్తగా కడుతున్న భవనంలోనే అగ్ని ప్రమాదం జరిగిందని, కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తితో సంబంధం లేదని అప్పట్లో పూనావాలా ప్రకటించారు. అక్కడ ఎలాంటి వ్యాక్సిన్లనూ ఉత్పత్తి చేయట్లేదన్నారు. ఈ ప్రమాదంతో కొవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి, సరఫరాపై ప్రభావం పడదన్నారు. అగ్ని ప్రమాదంతో రూ.వెయ్యి కోట్ల వరకు నష్టం వాటిల్లిందన్నారు. అయితే, పూనావాలా అప్పుడు ప్రకటించిన దానికి, ఇప్పుడు ఆయా దేశాలకు లేఖ రాసిన దానికి అసలు పొంతన లేదు. ఇదే విషయాన్ని పలువురు నిపుణులు ప్రస్తావిస్తున్నారు.

  • Loading...

More Telugu News