Chennai airport: నెత్తిపై విగ్గు.. అందులో రూ. 2.53 కోట్ల విలువైన బంగారం.. 11 మంది అరెస్ట్
- దుబాయ్, షార్జాల నుంచి బంగారం అక్రమ రవాణా
- పేస్ట్, ముడి బంగారం రూపంలో తరలింపు
- మరో ఘటనలో రూ. 24 లక్షల విలువైన విదేశీ కరెన్సీ పట్టివేత
నెత్తిపై విగ్గు ధరించి, అందులో బంగారాన్ని దాచి అక్రమంగా రవాణా చేస్తున్న ఏడుగురిని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న దుబాయ్, షార్జా నుంచి రెండు ప్రత్యేక విమానాలు చెన్నై చేరుకున్నాయి. అందులో వచ్చిన ప్రయాణికుల్లో కొందరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
వారు ధరించి విగ్గు, సాక్స్‌లలో బంగారం పేస్ట్, ముడి బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని మొత్తం విలువ రూ. 2.53 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో చెన్నై, తిరుచ్చి, రామనాథపురం, విళుపురం, సేలం జిల్లాలకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
అలాగే, అదే సమయంలో చెన్నై నుంచి షార్జాకు అక్రమంగా తీసుకెళ్లేందుకు తెచ్చిన రూ. 24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.