Arvind Kejriwal: ఉచిత విద్యుత్, నీరు హామీని మరో రాష్ట్రంలో కూడా ఇచ్చిన కేజ్రీవాల్
- ఉచిత విద్యుత్, నీరు హామీతో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న కేజ్రీ
- అవే హామీలను పంజాబ్ లో కూడా ఇచ్చిన కేజ్రీవాల్
- పంజాబ్ అంటే వీరుల జన్మస్థలమని వ్యాఖ్య
ఉచిత విద్యుత్, నీటిని అందిస్తామనే హామీతో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అవే హామీలను మరో రాష్ట్రంలో కూడా ఇచ్చింది. పంజాబ్ లో సైతం పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న ఆప్... ఆ రాష్ట్రంలో కూడా ఉచిత విద్యుత్, ఉచిత నీరు హామీని గుప్పించింది. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలపై పోరాడుతున్న రైతులకు కూడా తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. పంజాబ్ రైతులు పెద్ద సంఖ్యలో ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.
కిసాన్ మహాసమ్మేళన్ కార్యక్రమంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, పంజాబ్ అంటే వీరుల జన్మస్థలమని అన్నారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా... దానికి వ్యతిరేకంగా పంజాబ్ లోనే తొలి గొంతు వినిపిస్తుందని చెప్పారు. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పడితే ఉచిత విద్యుత్, ఉచిత నీరు ఇస్తామని తెలిపారు. ఢిల్లీలో నిరసన కర్యక్రమాలను చేపట్టిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారికి ఎలాంటి హాని కలగకుండా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.