Uttarakhand: ఎక్కువ రేషన్ కావాలంటే, 20 మంది పిల్లలను ఎందుకు కనలేదు?: ఉత్తరాఖండ్ సీఎం సంచలన వ్యాఖ్యలు
- ఇద్దరు వ్యక్తులున్న కుటుంబానికి 10 కేజీల బియ్యం అందుతున్నాయి
- 20 మంది ఉన్న కుటుంబానికి క్వింటా బియ్యాన్ని ఇస్తున్నాం
- సమయం ఉన్నప్పుడు ఇద్దరినే ఎందుకు కన్నారు?
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా నేపథ్యంలో పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని... వారికి ప్రభుత్వం ఇస్తున్న ఎక్కువ రేషన్ కావాలంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని చెప్పారు.
ఒక్కో వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం ఇస్తున్నామని... ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 50 కేజీలు అందుతున్నాయని తెలిపారు. 20 మంది కుటుంబ సభ్యులున్న వారికి క్వింటా బియ్యం వస్తోందని, దీంతో ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్నవారు ఓర్చుకోలేపోతున్నారని అన్నారు. మీకు సమయం ఉన్నప్పుడు కేవలం ఇద్దరు పిల్లలను మాత్రమే కన్నారని... 20 మందిని ఎందుకు కనలేదని ఆయన ప్రశ్నించారు.
మహిళల వస్త్రధారణపై కూడా కొన్ని రోజుల క్రితం ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరిగిన జీన్స్ ధరిస్తున్నారని మండిపడ్డారు. అమెరికన్లు భారతీయతను పాటిస్తుంటే... మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామని అన్నారు. నిన్న ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ అమెరికా మన దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిందని నోరు జారి, నాలుక కరుచుకున్నారు.