Maharashtra: హోం మంత్రిపై సీబీఐతో విచారణ చేయించండి: సుప్రీంకోర్టుకెక్కిన ముంబై మాజీ సీపీ పరంబీర్ సింగ్
- బదిలీలు, పోస్టింగుల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ
- అనిల్ దేశ్ ముఖ్ ఇంటి నుంచి సీసీటీవీ ఫుటేజీ తెప్పించాలని విజ్ఞప్తి
- ఆధారాలను నాశనం చేయకముందే విచారణ ప్రారంభించాలని వినతి
- పరంబీర్ తరఫున కేసు వాదించనున్న ముకుల్ రోహత్గీ
మహారాష్ట్ర హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ ముఖ్ అవినీతిపై విచారణ చేయించాలని కోరుతూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. బార్లు, రెస్టారెంట్లు, పబ్బుల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేసేలా ముఖేశ్ అంబానీ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజేకి అనిల్ దేశ్ ముఖ్ టార్గెట్ పెట్టారంటూ పరంబీర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. వాటిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని పరంబీర్ కోరారు. సోమవారం ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
దాంతో పాటు అధికారుల పోస్టింగులు, బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న రష్మీ శుక్లా నివేదిక ఆధారంగా అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ విచారణ చేయించాలన్నారు. తాను చేసిన ఆరోపణలు నిజమని తేలాలంటే మంత్రి ఇంటి వద్ద నుంచి సీసీటీవీ ఫుటేజీలను తెప్పించాలని పిటిషన్ లో కోరారు. పరంబీర్ సింగ్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కేసును వాదించనున్నారు. సోమవారం డీజీ హోంగార్డ్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తన బదిలీపై స్టే విధించాల్సిందిగా పిటిషన్ లో కోరారు.
అనిల్ దేశ్ ముఖ్ పై ఉన్న అన్ని ఆరోపణలపై ఎవరూ కేసును ప్రభావితం చేయకుండా సమగ్రమైన నిష్పక్షపాత విచారణను చేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆధారాలను నాశనం చేయకముందే వీలైనంత తొందరగా కేసు విచారణను ప్రారంభించాలన్నారు.