Harsha Kumar: ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర: మాజీ ఎంపీ హర్షకుమార్ ధ్వజం
- ఇటీవల రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
- ఇంకెన్ని తరాలు రిజర్వేషన్లు అమలు చేస్తారన్న ధర్మాసనం
- ముందు కొలీజియం వ్యవస్థ చక్కదిద్దుకోవాలన్న హర్షకుమార్
- కొలీజియం వ్యవస్థ లోపభూయిష్టమని కామెంట్
- అగ్రవర్ణాల వారు శిక్షలు తప్పించుకుంటున్నారని విమర్శలు
ఇంకెన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగిస్తారంటూ ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో దేశంలో రిజర్వేషన్ల కొనసాగింపు అంశం మరోసారి చర్చకు దారితీసింది. దీనిపై అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ స్పందించారు.
కొలీజియం వ్యవస్థ వల్ల దళితులు న్యాయమూర్తులు కావడంలేదని తెలిపారు. దేశ న్యాయ వ్యవస్థలో కొలీజియం వ్యవస్థ లోపభూయిష్టం అని విమర్శించారు. ఈ లోపాల కారణంగా అగ్రవర్ణాల వారు శిక్షల నుంచి తప్పించుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులు రిజర్వేషన్లపై మాట్లాడేముందు కొలీజియం వ్యవస్థలను చక్కదిద్దాలని హితవు పలికారు.
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అంటరానితనం నిర్మూలనకే రిజర్వేషన్లు అని, కులపరమైన అసమానతలను తగ్గించేందుకు రిజర్వేషన్లు ఉపకరిస్తాయని అన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు.