Janata Curfew: జనతా కర్ఫ్యూకి నేటితో సరిగ్గా ఏడాది పూర్తి!
- గత ఏడాది మార్చి 22న జనతా కర్ఫ్యూ అమలు
- మే 31 వరకు కొనసాగిన లాక్ డౌన్
- ఏడాది తర్వాత పలు చోట్ల లాక్ డౌన్లు, నైట్ కర్ఫ్యూలు
మన దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో జనతా కర్ఫ్యూ విధించి నేటితో ఒక ఏడాది పూర్తయింది. వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చి 22న జనతా కర్ఫ్యూని విధించింది. దీంతో దేశమంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఈ లాక్ డౌన్ 21 రోజుల పాటు కొనసాగుతుందని ఆరోజు ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రధాని ప్రకటనతో రైల్వేలు, విమానాశ్రయాలు, పాఠశాలలు, థియేటర్లు, కార్యాలయాలు, ప్రతి ఒక్కటీ మూతపడ్డాయి. కేవలం అత్యవసర విభాగాలు మాత్రమే పని చేశాయి.
గత మార్చి 22న మొదలైన లాక్ డౌన్ అలాగే కొనసాగుతూ మే 31 వరకు కొనసాగింది. ఆ తర్వాత విడతల వారీగా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ వచ్చారు. మరోవైపు ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ కలకలం రేపుతున్నాయి. లాక్ డౌన్ విధించి ఏడాది పూర్తయిన సమయంలో... దేశంలో పలు చోట్ల మళ్లీ లాక్ డౌన్లు, రాత్రి కర్ఫ్యూలు కొనసాగుతుండటం గమనార్హం.
గత 24 గంటల్లో 46,951 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 21,180 మంది కోలుకున్నారు. కోలుకుంటున్న వారి కంటే ఎక్కువ కేసులు నమోదు కావడం ఇది వరుసగా 12వ రోజు.