National Flag: త్రివర్ణాలు, అశోక చక్రం ఉన్న కేక్ కట్ చేస్తే అవమానించినట్టు కాదు: మద్రాస్ హైకోర్టు
- 2013 నాటి కేసులో హైకోర్టు తీర్పు
- ఒక వేడుకలో జాతీయ జెండా వంటి కేకును కట్ చేసిన వైనం
- జాతీయజెండాకు అవమానం జరిగినట్టు కాదని చెప్పిన హైకోర్టు
జాతీయపతాకంలోని మూడు రంగులు, అశోక చక్రం ఉన్న కేకును కట్ చేస్తే జాతీయజెండాను అవమానించినట్టు కాదని మద్రాస్ హైకోర్టు తీర్పును వెలువరించింది. 2013 నాటి కేసుకు సంబంధించిన తీర్పును వెలువరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా జాతీయపతాకంలోని మూడు రంగులు, అశోక చక్రం గుర్తులతో, 6X5 వైశాల్యం కలిగిన కేకును కట్ చేశారు. ఆ వేడుకలకు కోయంబత్తూరు జిల్లా కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ కూడా హాజరయ్యారు. కట్ చేసిన కేకును దాదాపు 2,500 మందికి పంచి పెట్టారు.
ఈ నేపథ్యంలో జాతీయజెండాకు అవమానం కలిగేలా వ్యవహరించారంటూ డాక్టర్ సెంథిల్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి కేకును నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 కింద నేరంగా పరిగణించాలని పిటిషన్ లో కోరారు. ఒకవేళ నేరం రుజువు అయినట్టైతే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది. అయితే ఈ కేసును విచారించిన హైకోర్టు... ఆ వేడుకల్లో పాల్గొన్న వారు జాతీయజెండాను అవమానించలేదని చెప్పారు.