Jagan: వెటర్నరీ వైద్యులు రైతు భరోసా కేంద్రాల్లోనూ సేవలు అందించేలా ఉండాలి: సీఎం జగన్
- పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై సమీక్ష
- క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం సమావేశం
- వెటర్నరీ వైద్యుల పోస్టులు భర్తీ చేయాలని ఆదేశం
- మూడ్నెల్లకోసారి బీమా క్లెయిమ్స్ పూర్తిచేయాలని సూచన
ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెటర్నరీ డాక్టర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. వెటర్నరీ వైద్యులు రైతు భరోసా కేంద్రాల్లో కూడా సేవలు అందించేలా ఉండాలని స్పష్టం చేశారు. ఆర్బీకేల్లో కియోస్క్ ద్వారా పశు దాణా, ఔషధాలు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. సీడ్, ఫీడ్, మెడికేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
వైఎస్సార్ చేయూత ద్వారా పశువులకు ఇనాఫ్ ట్యాగింగ్ చేయించాలని ఆదేశించారు. వైఎస్సార్ పశునష్ట పరిహారం పథకం ఆర్బీకేల్లో ప్రదర్శించాలని స్పష్టం చేశారు. మూడు నెలలకోసారి బీమా పరిహారం క్లెయిమ్స్ పూర్తి చేయాలన్నారు. బీమా పరిహారం బకాయిలు రూ.98 కోట్లు వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. ఆర్బీకేల్లోని కాల్ సెంటర్ పనితీరుపై తనిఖీ చేయాలని అన్నారు.