AMMK: టపాసులు కాల్చి నన్ను చంపేందుకు కుట్ర పన్నారు... ఏఎంఎంకే పార్టీపై తమిళనాడు మంత్రి ఆరోపణ
- మంత్రి కదంబూర్ రాజు ఆరోపణ
- తన విజయం ఖాయమని తెలిసే కుట్ర పన్నారన్న మంత్రి
- కారుకు మంటలంటుకుని మరణించేవాడినని వ్యాఖ్యలు
- ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
ఎన్నికలకు ముందు తనని చంపేందుకు ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే)’ పార్టీ యంత్రాంగం కుట్ర పన్నిందని తమిళనాడు మంత్రి, అన్నాడీఎంకే నేత కదంబూర్ రాజు ఆరోపించారు. తన విజయం తథ్యమని భావించే తనను చంపేందుకు చూస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే తన కారు పక్కనే భారీ ఎత్తున బాణసంచా పేల్చారని ఆరోపించారు.
వివరాల్లోకి వెళితే... ఆదివారం కోవిల్‌పట్టి నియోజకవర్గంలో రాజు ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళుతుండగా.. ఆయన కారుని కొందరు అడ్డుకున్నారు. అదే కారు పక్కనే భారీ ఎత్తున బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలో తన కారుకు మంటలంటుకుని భారీ ప్రమాదం జరిగి ఉండేదని మంత్రి అన్నారు. ఇది ఏఎంఎంకే పార్టీ పనేనని.. తనని చంపేందుకే ఇలా కుట్ర పన్నారని ఆరోపించారు.
ఘటన జరిగిన వెంటనే ఎన్నికల కమిషన్‌కు రాజు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఇంకా ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే మంత్రి ఆరోపణలపై ఏఎంఎంకే సైతం ఇప్పటి వరకు స్పందించలేదు.