Coronavirus: కొవిషీల్డ్ రెండో డోసు 6-8 వారాల మధ్య ఇవ్వండి... రాష్ట్రాలకు కేంద్రం లేఖ
- కరోనా టీకా కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్
- ప్రస్తుతం రెండు డోసుల మధ్య వ్యవధి 28 రోజులు
- దీన్ని 6-8 వారాలకు పెంచితే మరింత మెరుగైన రక్షణ
- దేశంలో వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
- ఇప్పటివరకు 4.50 కోట్ల మందికి టీకా
భారత్‌లో ‘సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ఉత్పత్తి చేస్తున్న కరోనా టీకా కొవిషీల్డ్‌తో మెరుగైన ఫలితాలు పొందేందుకు రెండు డోసుల మధ్య వ్యవధిని 6-8 వారాలకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి సంబంధించి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ వ్యవధి కేవలం కొవిషీల్డ్‌కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
‘కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి గురించి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్(ఎన్‌టీఏజీఐ), నేషనల్ ఎక్స్‌ఫర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కొవిడ్-19(ఎన్‌ఈజీవీఏసీ) మరోసారి సమీక్ష జరిపాయి. పలు శాస్త్రీయ ఆధారాల నేపథ్యంలో దీనికి సంబంధించిన చర్చ జరిగింది’ అని కేంద్రం ఆ లేఖలో పేర్కొంది. ప్రస్తుతం రెండు డోసుల మధ్య వ్యవధి 28 రోజులుగా ఉంది. అయితే, దీన్ని 6-8 వారాలకు పెంచితే మరింత సమర్థంగా పనిచేస్తుందని తెలిపింది. అయితే, వ్యవధి 8 వారాలకు మించరాదని స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్రం జనవరి 16 నుంచి మొదటి దశ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మార్చి ఒకటిన రెండో దశలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను అత్యవసర వినియోగం కింద వాడుతున్నారు. ఇప్పటివరకు 4.50 కోట్ల మందికి టీకా డోసులను పంపిణీ చేశారు. 28 రోజుల వ్యవధితోనే ఈ రెండు టీకాలను అందిస్తున్నారు.